ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీనియర్ యాక్టర్ వేలాది మంది సమక్షంలో శాల్యూట్ చేశారు. ఇందుకు జోగునాథునిపాలెం బహిరంగ సభ వేదికైంది. తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం సాకారం కావడంతో సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్.నారాయణ మూర్తి ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిందన్నారు. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దయనీయ స్థితి నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, ఉమాశంకర్ గణేష్, మరికొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం జగన్‌ను కలిశామన్నారు.
తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని సీఎం జగన్‌కు వివరించినట్టు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారన్నారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు శాల్యూట్ అని ఉద్వేగంగా తన కృతజ్ఞతను ఆర్.నారాయణమూర్తి ప్రదర్శించడం విశేషం.
కార్మిక, కర్షక శ్రేయోభిలాషిగా ఆర్.నారాయణమూర్తికి పేరు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కార్మిక, కర్షక పక్ష పాతిగా వుంటాయి. అలాంటి నటుడు, దర్శకుడి నుంచి శాల్యూట్ అందుకోవడం వైసీపీ శ్రేణులకి ఆనందాన్ని కలిగించేదని చెప్పొచ్చు.