జనసేనాని పవన్‌కల్యాణ్‌ను దత్త పుత్రుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్దుగా పిలుస్తుంటారు. సభ ఏదైనా దత్త పుత్రుడిపై ఏదో ఒక విమర్శ చేయనిదే జగన్ ప్రసంగాన్ని ముగించరు. ఇవాళ నర్సీపట్నం బహిరంగ సభలో మరోసారి పవన్‌కల్యాణ్‌పై తన మార్క్ పంచ్‌లతో జగన్ విరుచుకుపడ్డారు. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ దెప్పి పొడిచారు. అలాగే చంద్రబాబును విడిచిపెట్టలేదు.
ఒక్కటంటే ఒక్క మంచి పనైనా చంద్రబాబు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. దత్త తండ్రిని నెత్తిన పెట్టుకుని ఓ దత్త పుత్రుడు తిరుగుతున్నాడని వెటకరించారు. ఈ రాష్ట్రం కాకుంటే ఆ రాష్ట్రం, ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీతో, ఈ భార్య కాకుంటే ఆ భార్య అన్నట్టుగా వారి వ్యవహారం ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇవన్నీ చూస్తుంటే ఇదేం ఖర్మరా అని అనిపిస్తోందని చంద్రబాబు తనపై ఎక్కు పెట్టిన విమర్శను తిరిగి ప్రత్యర్థులపైకే జగన్ సంధించారు. పవన్‌కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కమలాపురం సభలో ఇదే రీతిలో ఇటీవల జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ భార్య కాకపోతే ఆ భార్య అని పవన్‌ను ఉద్దేశించి జగన్ పరోక్షంగా ఘాటు విమర్శ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో విషాదం చోటు చేసుకోవడంపై జగన్ ఫైర్ అయ్యారు.
ఫొటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసమే 8 మంది ప్రాణాలను చంద్రబాబు తీశారని విరుచుకుపడ్డారు. ఇంతకంటే ఘోరం వుంటుందా? అని ఆయన నిలదీశారు. గోదావరి పుష్కరాల్లోనూ దర్శకుడిని పక్కన పెట్టుకుని ఇదే రీతిలో షూటింగ్ కోసం ఏకంగా 29 మంది ప్రాణాలు బలిగొన్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అని అనుకున్నారని విమర్శించారు. రాజకీయం అంటే షూటింగ్‌లు, డైలాగ్‌లు కాదన్నారు.
రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదని సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయం అంటే డ్రామాలు అంత కంటే కాదన్నారు. రాజకీయం అంటే పేద కుటుంబాల్లో మంచి మార్పు తీసుకురావడమే అని అన్నారు. 73 ఏళ్ల ముసలాయనను చూస్తే గుర్తొచ్చేవి రెండు స్కీమ్‌లు అని… ఒకటి వెన్నుపోటు, రెండు మోసాలు అని దెప్పి పొడిచారు.