ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కి మెట్రో రైల్ మంజూరు అయింది. ఇపుడు అక్కడ మెట్రో రైల్ జోరు చేస్తోంది. హైదరాబాద్ తరువాత స్థానంలో ఉన్న విశాఖలో మాత్రం ఈ రోజుకీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కాగితాల మీదనే ఉంది. విభజన తరువాత ఏపీకి ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామని కేంద్ర పెద్దలు చెప్పారు.
దానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి పంపించారు. అయితే రెండేళ్ళ తరువాత 2017ల డీపీయార్ ని రివైజ్ చేసి పంపాలని కేంద్రం కోరింది. ఇదిలా ఉంటే చంద్రబాబు విజయవాడ మీద దృష్టి పెట్టి విశాఖ డీపీయార్ విషయం పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.
కేంద్రం రివైజ్డ్ డీపీయార్ రిపోర్ట్ 2017లో అడిగినా కూడా చంద్రబాబు సర్కార్ పంపించలేదు. ఆయన 2019లో దిగిపోయి వైఎస్ జగన్ సీఎం అయ్యారు. ఆయన పాత డీపీయార్ ప్లేస్ లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని విస్తరిస్తూ దాదాపుగా 80 కిలోమీటర్ల మేర విశాఖ సిటీ శివారు ప్రాంతాలను కలుపుతూ ఉండేలా డిజైన్ చేయించారు.
తాజాగా ఢిల్లీకి వెళ్ళినపుడు ముఖ్యమంత్రి విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి ప్రధాని మోడీతో ప్రస్తావించారు. విశాఖ సిటీ ఈ రోజుకు ముప్పయి లక్షల దాకా ఉంది. రానున్న రోజూలో యాభై లక్షలకు చేరువ అవుతోంది. విశాఖ అంటే భౌగోళికపరంగా కూడా గాజువాక అవతల నుంచి ఇటు తగరపువలస దాకా విస్తరించి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో వస్తే కనుక మరింతగా సిటీ డెవలప్ అవుతుంది.
దాంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ విశాఖకు అత్యవసరం. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు జగన్ చెప్పారు. మరి కేంద్రం నుంచి మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఎపుడు వస్తుందో. విశాఖలో మెట్రో రైల్ కూత ఎపుడు పెడుతుందో చూడాలి. మెగా సిటీగా ఉన్న విశాఖకు మెట్రో రైల్ ఒక అందమైన అలంకారం అవుతుంది అని నగరాభివృద్ధి కోరుకునే వారు అనే మాట. దాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.