మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరుకు తెరలేపింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి పోవడం, ఇదే సందర్భంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డికి దక్కడం సరికొత్త రాజకీయాలకు తెరలేచింది.
మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో బహిరంగంగానే అసంతృప్తిని వెల్లడించారు. మంత్రి పదవి రాకపోవడంతో మీడియా సాక్షిగా ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వెళ్లి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా మంత్రి కాకానికి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, శ్రీధర్‌రెడ్డిలతో విభేదాలున్నాయి. దీంతో మంత్రి పదవి పోయి అసంతృప్తిగా ఉన్న అనిల్‌కుమార్, అలాగే అమాత్య పదవి దక్కలేదని రగిలిపోతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కలయిక సహజంగానే కాకానికి వ్యతిరేక భేటీగా నెల్లూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
వ్యవసాయశాఖ మంత్రిత్వశాఖను దక్కించుకున్న కాకాని గోవర్ధన్‌రెడ్డి మొదటిసారిగా ఈ నెల 17న సొంత జిల్లాకు వస్తున్నారు. కాకాని రాకను పురస్కరించుకుని నెల్లూరులో అభిమానులు పెద్ద ఎత్తున ప్లెక్సీలు కడుతూ, ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాకానిపై ఇటీవల అనిల్ సెటైర్లు విసరడంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి.
కాకాని నెల్లూరుకు వస్తున్న రోజే పార్టీ కార్యకర్తలతో అనిల్ కీలక భేటీ నిర్వహించాలని అనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనను కాకాని మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి పిలవలేదని, అందువల్లే పోలేదని ఇటీవల అనిల్ చెప్పారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాని ఏ విధంగానైతే ప్రేమ, వాత్సల్యం చూపారో, సహకారం అందించారో, తాను రెండింతలు అవే అందిస్తానని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తనకు మంత్రి పదవి రాకపోవడంతో పాటు వ్యతిరేక వర్గంగా భావించే కాకానికి దక్కడంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అనిల్, కోటంరెడ్డి మధ్య విభేదాలున్నప్పటికీ, ఇవాళ కలుసుకోవడం ప్రాధాన్యం ఏర్పడింది.
శత్రువుకు శత్రువు మిత్రుడనే రీతిలో ఇద్దరికీ రాజకీయంగా గిట్టని కాకానికి వ్యతిరేకంగా అనిల్, కోటంరెడ్డి గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రాబోయే రోజుల్లో నెల్లూరు వైసీపీలో అసమ్మతి కార్యకలాపాలు ఊపంచుకోవడం పక్కా అని సొంత పార్టీ నేతలే చెబుతుండడం విశేషం.