గుజ‌రాత్ కాంగ్రెస్ లో మొద‌లైన లుక‌లుక‌లు

సొంత పార్టీపై కాంగ్రెస్ యువ‌నేత హార్థిక్‌ ప‌టేల్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ చేయించుకున్న వ‌రుడిలా త‌న ప‌రిస్థితి కాంగ్రెస్‌లో త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గుజరాత్‌లో విద్యా, ఉద్యోగాల్లో పాటిదార్లకు…

సొంత పార్టీపై కాంగ్రెస్ యువ‌నేత హార్థిక్‌ ప‌టేల్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ చేయించుకున్న వ‌రుడిలా త‌న ప‌రిస్థితి కాంగ్రెస్‌లో త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గుజరాత్‌లో విద్యా, ఉద్యోగాల్లో పాటిదార్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ యువ‌కుడైన‌ హార్థిక్ పటేల్ ఉద్య‌మించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 

ఆ త‌ర్వాత నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట కాంగ్రెస్‌లో చేరి బీజేపీకి చుక్క‌లు చూపించారు. ప‌టేళ్ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు హార్థిక్‌ను చేర్చుకున్న కాంగ్రెస్‌, ప్ర‌స్తుతం అంత‌గా విలువ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న మాట‌లే చెబుతున్నాయి.

మ‌రో ఏడాదిలో గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. త‌న గోడు వినిపించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా హార్థిక్ ప‌టేల్ భావించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గుజ‌రాత్ పీసీసీలో కొంద‌రు త‌న‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని వాపోయారు. పార్టీని విడిచి వెళ్లేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

పీసీసీ త‌నను ఎన్నో ఇబ్బందులు పెడుతోంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో పిల్ల‌లు పుట్ట‌కుండా కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ చేయించుకున్న వ‌రుడిలా త‌న ప‌రిస్థితి త‌యారైందని వాపోయారు. త‌న‌కు పార్టీలో జ‌రుగుతున్న అన్యాయంపై అనేక ద‌ఫాలు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. 

ఇత‌ర పార్టీల‌తో గుజ‌రాత్ పీసీసీ నేత‌లు లోపాయికారీ ఒప్పందం పెట్టుకోవ‌డ వ‌ల్లే అధికారానికి కాంగ్రెస్ దూర‌మైంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను గుజ‌రాత్ పీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా నియ‌మించార‌ని, అయినా  అధికారాలేమీ లేవ‌ని హార్థిక్ ప‌టేల్ వాపోయారు. పార్టీ కీల‌క‌ స‌మావేశాల‌కు కూడా ఆహ్వానించ‌డం లేద‌ని, అలాగే ఏ నిర్ణ‌యాల్లోనూ  భాగ‌స్వామిని చేయ‌డం లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.