ఐఏఎస్ అధికారి బసంత్‌కుమార్‌కు ప్రత్యేక ట్రాక్ రికార్డ్ ఉంది. నిరాడంబర, నిజాయతీ అధికారిగా గుర్తింపు ఉంది. టీటీడీ జేఈవోగా పని చేస్తూ నాటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు దగ్గరుండి దర్శన భాగ్యం కల్పించిన కారణంగా బదిలీ వేటుకు గురయ్యారు. అలాంటి అధికారి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్‌కు ఈ ప్రశంసలు ఎంతో ప్రత్యేకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బసంత్‌కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనది 38 ఏళ్ల ఉద్యోగానుభవం. గురువారం అంబేద్కర్ జయంతి వేడుకలో జగన్ ప్రభుత్వంపై బసంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన 38 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సమసమాజ స్థాపనకు ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు.
అయితే తాను చేస్తున్న మంచి గురించి ప్రభుత్వం బయటకు ఏమీ చెప్పుకోవడంలేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో మాటలు కాకుండా చేతలలో చూపెట్టారన్నారు. అందుచేత ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ పిలుపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోంది.
ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అత్యధికంగా బీసీలు, ఇతర అణగారిన వర్గాలకు పెద్దపీట వేయడాన్ని దృష్టిలో పెట్టుకుని బసంత్ తాజా వ్యాఖ్యలు చేసి వుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి విషయంలో జగన్ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇవ్వడం బసంత్‌కుమార్‌కు నచ్చినట్టుంది. అందుకే ఆయన జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.