రివ్యూ: కేజీయఫ్ – ఛాప్టర్ 2
రేటింగ్: 3/5
తారాగణం: యష్, శ్రీనిధి, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
కూర్పు: ఉజ్వల్ కులకర్ణి
ఛాయాగ్రహణం: భువన్ గౌడ
నిర్మాత: విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022
2018 లో కన్నడ సీమ నుంచి వచ్చి దేశం మొత్తానికి వినిపించేంత గట్టిగా తొడగొట్టి నిలబడ్డ చిత్రం “కేజీఎఫ్ ఛాప్టర్-1”.
కంటెంట్ పరంగా కొన్ని లోటుపాట్లున్నా అధికశాతం ప్రేక్షకులకి పూనకం తెప్పించగలిగిన కారణంగా ఆ చిత్రం చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు దాని సీక్వెల్ కేజీఎఫ్ -2 వచ్చేసింది.
“బాహుబలి-ది బిగినింగ్” కంటే “బాహుబలి- ద కంక్లూజన్” ప్రేక్షకుల మెప్పు పొంది మూడు రెట్లు పెద్దదనిపించుకుంది.
మరి “కేజీఎఫ్- ఛాప్టర్ 1” కంటే “కేజీఎఫ్- ఛాప్టర్ 2” అలా అనిపించుకోనుందా?
విషయంలోకి వెళ్తే “కేజీఎఫ్-2” లో కూడా అదే హై సౌండ్ కథనం. అయితే ఈ తరహా జానర్ ని సెట్ చేసి విజయం సాధించాడు కనుక అదే మార్గంలో నడిచాడు.
రాజమౌళి, బోయపాటి, కొరటాల లాంటి దర్శకులు హీరో ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఆ ముగ్గురినీ మించిపోయాడు. ఎవెంజెర్స్, సూపర్ మ్యాన్ లాంటి ఎనెర్జీ లెవెల్స్ ని హీరో ఎలివేషన్ లో నింపేశాడు.
మొదటి అధ్యాయంలో గరుడ తలని నరికేసిన తర్వాత రాకీ ఏమయ్యాడు? తర్వాత మళ్లీ సీన్లోకి ఎలా వచ్చి ఏం చేసాడనేది కథ.
ఒక సినిమా చూసిన అనుభూతి కంటే సుమారు 50-60 ట్రైలర్స్ ని వరసుగా చూస్తున్న ఫీలింగొస్తుంది. ప్రతి సీన్ ఒక గ్రిప్పింగ్ ట్రైలర్ లాగ కట్ చేసినట్టుంది. ఈ ధోరణి మొదటి అధ్యాయంలో కూడా ఉంది. ఆద్యంతం హెవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎడతెరిపి లేకుండా కట్టిపారేస్తుంది.
విజువల్ గా కూడా గనుల నేపథ్యం, కలర్ కాంట్రాస్ట్, గ్రాఫిక్స్ అన్నీ కలిపి ఏదో వేరే లోకంలోకి తీసుకుపోతాయి.
ఈ జానర్ లో లాజిక్ లు వెతకక్కర్లేదు. అయినా కూడా పార్లమెంటులో గన్ పట్టుకుని ప్రవేశించి ప్రధాన మంత్రి చూస్తుండగానే ఫైరింగ్ చేసిన సీన్ అతిశయోక్తికే అతిగా అనిపిస్తుంది. అలాగే బలవంతపు డ్రామాలు కూడా ఉన్నాయిందులో. క్లైమాక్స్ కి ముందు తల్లికి, డాక్టర్ కి మధ్యలో జరిగే సన్నివేశం అతి ఎక్కువయ్యి అతకలేదు.
ఇలాంటి రెండు మూడు సన్నివేశాలు మినహాయిస్తే మిగతాదంతా మాస్ ప్రేక్షకులకి ఫుల్ మీల్సే.
మొదటి అధ్యాయం చూడని వాళ్లకి ఈ జానర్ సెట్ అవడానికి టైం పడుతుంది. ఫాస్ట్ కట్ ఎడిటింగ్ వల్ల అర్థం కావడానికి, అనుభూతి చెందడానికి అవకాశం దొరకదు.
అసలీ సినిమాకి ఎడిటర్ గా పని చేయడమంటే మమూలు విషయం కాదు. సగటున క్షణానికి 2-3 కట్స్ ఉన్నాయంటే ఇక అర్థం చేసుకోవచ్చు. ఇదేదో కాసేపంటే పర్వాలేదు. కానీ సినిమా మొత్తం ఇదే పరిస్థితి.
కెమెరా వర్క్, గ్రాఫిక్స్ రిచ్ గా ఉన్నాయి. పాటలకి ప్రాముఖ్యత లేదు. నేపథ్య సంగీతం చాలా హెవీగా ఉంది.
యష్ తెర మీద ఆకట్టుకున్నాడు. తొలి భాగంలో తన ఆయుధమైన సుత్తిని ఈ భాగంలో కూడా కీలకమైన ఫైట్లో వాడాడు. ఫస్టాఫ్ లో యష్ ని చూసిన ఒక పిల్లవాడి చేత “సుత్తివీరుడు..!!” అని కూడా అరిపించాడు దర్శకుడు.
సంజయ్ దత్ గెటప్ చిత్రంగా ఉంది. క్యారక్టర్ లో ఇంకాస్త లోతు పెంచుండాల్సింది.
శ్రీనిధికి కాస్త పాత్ర ఉంది కానీ సెంటిమెంటల్ గా ముగిసింది.
ప్రధానమంత్రిగా రవీనా టాండన్ స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుపెట్టుకునే ఉంది. ఆమెకు, యష్ కి మధ్యలో సన్నివేశాలు గ్రిప్పింగ్ గా ఉన్నాయి.
ప్రకాష్ రాజ్ మాత్రం వాయిసోవర్ ఆర్టిస్టుగా పరిమితమయ్యాడు.
సీబీఐ ఆఫీసర్ గా రావు రమేష్ కథాగమనానికి ఉపయోగపడ్డాడు.
ఫస్టాఫ్ బరువుగా నడిపి, సెకండాఫులో ప్రధానమంత్రి సన్నివేశాలు కూడా బాగానే రక్తికట్టించి క్లైమాక్స్ కి వచ్చే సరికి షిప్ మునిగి కంటెంట్ తేలిపోయినట్టయ్యింది. ఎమోషనల్ గా ఇంకేదైనా చేసుంటే బాగుండేదనిపిస్తుంది. అది పక్కనపెడితే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా రిచ్ గా తెరకెక్కింది.
ఇక సన్నివేశపరంగా కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి:
– “ఇక్కడ తలలు శాశ్వతం కాదు. కిరీటాలే శాశ్వతం”.
– “నేను ఇండియాకే సీ.ఈ.ఓ ని”
అలాగే “నేను పిల్లల జోలికి, ఆడవాళ్ల జోలికి పోను” అని చెప్పే డైలాగ్ కూడా బాగా పండింది.
ఇలా మాస్ ఆడియన్స్ ని రంజింపజేసే సంభాషణలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
ఇక బంగారు బిస్కెట్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన యష్ అక్కడ చేసే విధ్వంసాన్ని అద్భుతంగా తీసారు. ఇది పక్కా ఎవెంజెర్స్ టైప్ సీన్ లాగ అనిపిస్తుంది. అలాగే సంజయ్ దత్ మీద యాష్ “కలాష్ నికోవ్” ఆర్మీ చేసే దాడి కూడా ఈలలు వేయిస్తుంది.
హై డోస్ యాక్షన్ సన్నివేశాలు, సూపర్ హీరో పర్ఫార్మెన్స్ నచ్చే ఆడియన్స్ కి “కేజీఎఫ్ – ఛాప్టర్ 2” నచ్చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మొదటి భాగం నచ్చినవాళ్లందరికీ ఈ రెండవ భాగంతో కంప్లైంట్ ఉండదు.
హీరో ఎలివేషన్స్ కి, హెవీ డోస్ యాక్షన్ ఎపిసోడ్స్ కి చిరునామా ఈ కేజీఎఫ్ ఛాప్టర్ 2.
బాటం లైన్: మాస్ ప్రేక్షకులకి పైసా వసూల్