ఏపీలో కొత్త మంత్రులకు జగన్ అధికారికంగా శాఖలు నిర్ణయించేశారు. వాటిని కేటాయించేశారు. ఇక ఎవరి శాఖలలో వారు పని చేసుకోవడమే అని అనుకుంటే పొరపాటే. ఏపీలోని విపక్షాలను నిలువరించే శాఖలు కూడా అనధికారికంగా వారికి కట్టబెట్టబడతాయి.
గత ప్రభుత్వంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ మంత్రులుగా పవన్ మీద చంద్రబాబు మీద వీర లెవెల్ లో విరుచుకుపడేవారు. మరి కొత్త మంత్రులలో ఎవరు ఈ శాఖలు చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ ని విమర్శించే శాఖను అనకాపల్లి జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ స్వీకరించేశారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నపుడే పవన్ని గతంలో కూడా ఘాటుగా విమర్శించారు. పవన్ సామాజికవర్గానికి చెందిన ఈ యువ మంత్రి జనసేనానికి గట్టిగా రిటార్ట్ ఇచ్చేయడంలో స్పెషలిస్ట్. ఇక కొత్తగా మంత్రి. అందునా కీలకమైన శాఖలు దక్కాయి. పరిశ్రమల శాఖతో పాటు ఐటీ కూడా దక్కింది. దాంతో ఈ యువ మంత్రి పవన్ శాఖను కూడా తానే పుచ్చేసుకున్నాడు.
ఏపీకి పవన్ ఒక టూరిస్ట్ గా వచ్చే పొలిటీషియన్ అంటూ గుడివాడ మంత్రిగా తొలి పంచ్ అదిరిపోయే లెవెల్ లో వేసేశాడు. ఇక పవన్ అన్న నేత ఏపీ రాజకీయాలకు, జనాలకు గుర్తుండాడా అని డౌట్ కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి పవన్ని ఆయన ఫ్యాన్స్ ని కెలకడం స్టార్ట్ చేశారు అంటే గుడివాడ పేరు ఏపీలో మారుమోగడం ఖాయం.
మరి దీని మీద జనసైనికుల కౌంటర్లు ఎటూ ఉంటాయి. కానీ గుడివాడ వాగ్దాటి మాత్రం మెచ్చాల్సిందే. ఆయన దూకుడు కూడా ఆగేది లేదంతే.