ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ రసాయన పరిశ్రమలో నిన్న రాత్రి జరిగిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది తీవ్ర గాయాలపాలు కావడంపై జనసేనాని పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన సాయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంపై పవన్ స్పందిస్తూ ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఒక్కో దుర్ఘటనలో ఒక్కో రకమైన సాయం అందించడం ఏంటని ఆయన నిలదీశారు. విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. అలాగే వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం సాయం అందజేయడాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ స్పందించారు.
పోరస్ రసాయన పరిశ్రమ కార్మికుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతా ప్రమాణాలపై అధికారులు నిరంతరం తనిఖీలు చేసి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.