కాళింగులు ఏమి పాపం చేశారు బాబూ?

ఏపీలో దాదాపుగా పదిహేను లక్షల మంది దాకా ఉన్న కాళింగులు ఏమి పాపం చేశారు బాబూ అని ఆ సామాజిక వర్గం పెద్దలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీలలో తమకు మంచి పదవులు దక్కాయని వారు…

ఏపీలో దాదాపుగా పదిహేను లక్షల మంది దాకా ఉన్న కాళింగులు ఏమి పాపం చేశారు బాబూ అని ఆ సామాజిక వర్గం పెద్దలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీలలో తమకు మంచి పదవులు దక్కాయని వారు గుర్తు చేస్తున్నారు. స్పీకర్ పదవి ఇచ్చి వైసీపీ గౌరవించిందని అంటున్నారు. టీడీపీ మాత్రం మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం భావ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. కళింగ సామాజిక తరగతి అంటే కేవలం శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాదని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వారి ప్రభావం ఉందని గుర్తు చేస్తున్నారు.

ఒక్క విశాఖ నగరంలోనే లక్షకు పైగా జనాభా ఉన్నారని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడి ఉన్నారన్నారని గణాంకాలు ముందు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్‌, టిడిపి వైసీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కళింగులకు రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చారని అదే సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా మంత్రివర్గంలో తమ సామాజిక తరగతికి చోటు కల్పించకపోవడం బాధాకరమని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి కూటమి విజయంలో కళింగ సామాజిక తరగతి కీలకపాత్ర పోషించిందని వారు అంటున్నారు.  ఇతర సామాజిక తరగతులకు పదవులు ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, జిల్లాలో ఎంతమందికి పదవులు ఇస్తే అంత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి కూన రవికుమార్‌, బెందాళం అశోక్‌ గెలుపొందినందున వీరిలో ఎవరికి స్థానం కల్పించినా తమ సామాజిక వర్గం సంతోషిస్తుందని కాళింగ నేతలు అంటున్నారు. కాళింగులకు చోటు ఇస్తే బీసీలు ఇంకా టీడీపీకి చేరువ అవుతారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి వెళ్లడంతో మిగిలిన సామాజిక వర్గాలు కొంత అసంతృప్తికి లోను అవుతున్నాయి. దీనిని సరిచేయాలని బాబుని కోరుతున్నారు.