మేయర్ ని దించేస్తాం

అప్పుడే దించడాలు పెంచడాలు స్టార్ట్ అయిపోయాయా అంటే రాజకీయం అంటేనే ఇది అని అనుకోవాలి. ఏపీలో కనీ వినీ ఎరగని మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఎక్కడికక్కడ స్థానిక నాయకులు పదవుల…

అప్పుడే దించడాలు పెంచడాలు స్టార్ట్ అయిపోయాయా అంటే రాజకీయం అంటేనే ఇది అని అనుకోవాలి. ఏపీలో కనీ వినీ ఎరగని మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఎక్కడికక్కడ స్థానిక నాయకులు పదవుల మీద ఆరా తీస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇతర పదవులు ఎలాగూ ఉంటాయి. అధికారంలో ఉన్న అండతో స్థానిక సంస్థలలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అందలాలు అందుకోవాలన్న ఆత్రం చాలా మందిలో కనిపిస్తోంది.

విశాఖ మేయర్ మీద టీడీపీ కన్ను పడింది. 98 మంది కార్పోరేటర్లు కలిగిన విశాఖ కార్పొరేషన్ లో 56 కార్పోరేటర్లు వైసీపీకి ఉన్నారు. మెజారిటీ సాధించాలి అంటే 50 మంది దాకా అవసరం. వైసీపీలో పక్క చూపులు చూసే వారిని తమ వైపు రప్పించుకుంటే మేయర్ పీఠం కైవశం అవుతుందని భావిస్తున్నారు. విశాఖ మేయర్ ని దించేస్తామని తాజాగా విశాఖ టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

తొందరలోనే మేయర్ టీడీపీ పరం కాబోతోంది అని ఆయన జోస్యం చెబుతున్నారు. ఈ విషయంలో వైసీపీ కూడా అలెర్ట్ అయింది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి దీని మీద కార్పోరేటర్లతో మీటింగ్ పెట్టారు. పార్టీ నేతలతో మాట్లాడారు. మేయర్ పీఠాన్ని కాపాడుకోవాల్సిందే అని ఆయన అంటున్నారు.

అయితే అధికారం చేతిలో ఉన్న వారిదే పై చేయి అవుతూండడం చూస్తున్న రాజకీయ కధ. ఎవరు ఏ వైపు ఉంటారు అన్నది చెప్పలేని పరిస్థితి. మరి కొద్ది రోజులలో విశాఖ మేయర్ విషయంలో రాజకీయ క్రీడ స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు.