శ్రీకాకుళం జిల్లా తదితర ప్రాంతాలు కళింగ సీమగా చెబుతారు. అశోకుడు కాలంలో వీటిని కళింగ రాజులు ఒడిశా తో పాటు ఇటు విశాఖ వరకూ ప్రాంతాలను పాలించారని చరిత్ర చెబుతోంది. ఇక తరువాత కాలంలో ప్రజాస్వామ్య యుగంలో కూడా కాళింగులు రాజకీయాలను శాసిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి చూస్తే ఇప్పటికా 36 ఏళ్ల పాటు కాళింగ సామాజిక వర్గం నంచే ఎంపీలు శ్రీకాకుళానికి నెగ్గారు. అందులో అగ్ర తాంబూలం బొడ్డేపల్లి రాజగోపాలరావుదే. ఆయన పాతికేళ్ళ పాటు ఎంపీగా ఉన్నారు.
అయితే 1996 నుంచి రాజకీయం మారింది. ఎర్రన్నాయుడు ఎంపీగా నాలుగుసార్లు నెగ్గారు. పదమూడేళ్ల పాటు ఆయన ఉన్నారు. ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టాలని రామ్మోహన్ నాయుడు 2024లో టీడీపీ తరఫున శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తున్నారు.
కాళింగులకు చివరిసారి శ్రీకాకుళం ఎంపీ సీటు 2009లో దక్కింది. పదిహేనేళ్ళుగా ఆ పదవి అందని పండుగా మారింది. ఈసారి ఎలాగైనా శ్రీకాకుళం సీటు కొట్టాలని చూస్తున్నారు. వైసీపీ సామాజిక సమీకరణలో భాగంగా 2019 కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనుకు లోక్ సభ సీటు ఇచ్చింది. ఆయన గెలుపు దగ్గరలోకి వచ్చి ఓటమి చూశారు.
ఈమారు పేడాడ తిలక్ కి ఎంపీ సీటు ఇస్తున్నారు. తాజాగా జరిగిన కాళింగ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో తిలక్ మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే కాళింగులదే అన్నారు. ఈసారి గెలుపు తమ వైపే అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కళింగ యుద్ధమే అన్నారు. కాళింగుల ఉనికిని కాపాడుకోవాలంటే ఎంపీ సీటు గెలిచి తీరాల్సిందే అని పిలుపు ఇచ్చారు. రాజ్యాధికారం కాళింగ జాతి చేతిలో ఉండాలని ఆయన కోరారు.
వైసీపీ ఎంపీ అభ్యర్ధి ప్రకటనతో ఈసారి హోరా హోరీ పోరు శ్రీకాకుళంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రాలో ప్రతీ చోటా విస్తరించిన కాళింగులు అంతా ఏకమై శ్రీకాకుళం ఎంపీ సీటులో వైసీపీని గెలిపించాలని కాళింగుల పూర్వ వైభవాన్ని తిరిగి తేవాలని కోరుతున్న నేపధ్యం ఉంది.