కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నదనే అనుమానం ఇక్కడి రాజకీయాలను గమనిస్తున్న చాలామందిలో ఉంది. చంద్రబాబు నియమించిన ఏజెంట్ లాగా మాట్లాడుతున్న షర్మిల.. అన్ని రకాలుగా ఆయనను ముఖ్యమంత్రి చేయడమే జీవిత అశయం అన్నట్టుగా ఉన్నారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి చంద్రభక్తి కేవలం ఏపీ కాంగ్రెస్లో మాత్రమే కాదు.. తెలంగాణలో రాజ్యాధికారం వెలగబెడుతున్న రేవంత్ రెడ్డి అనుచరగణంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ సాక్షిగా మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ శాసనసభలో కృష్ణాజిల్లాల వ్యవహారంపై వాడీ వేడి చర్చ జరిగింది. సాధించడంలో విఫలమైన కేసీఆర్ గురించి అనేకమంది మంత్రులు మాట్లాడారు. అయితే, ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. అ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినప్పుడు.. కేంద్రాన్ని నిలదీయలేదంటూ పసలేని ఆరోపణలు చేశారు. విభజన చట్టంలో ఉన్న మేరకే ఆ కేటాయింపు జరిగిన తీరును మంత్రి జూపల్లి మరిచిపోయారు. కృష్ణాజలాల సాధనలో కచ్చితంగా వ్యవహరించకుండా.. కేంద్రం ముందు మోకరిల్లారని ఆరోపించారు. కెసిఆర్ గురించి ఇలా తనకు తోచినదల్లా చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ జగన్తో ముడి పెట్టడమే అసందర్భంగా, ఆనుచితంగా, అసహజంగా ఉంది.
చంద్రబాబు అంటే కేసీఆర్ కు రాజకీయంగా సరిపడదని.. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్ కోరుకున్నారని.. అందుకే ఏపీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి సహకరించారని కృష్ణారావు అన్నారు. కృష్ణా జలాలపై చర్చలో ఈ విషయం ఎందుకు చెప్పారో తెలియదు. కానీ చంద్రబాబు రెండో సారి సీఎం కాలేకపోయారని ఆవేదన మాత్రం ఆయన మాటల్లో కనిపించింది.
రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భక్తులు అనే సంగతి అందరికీ తెలుసు. రేవంత్ మనసెరిగి నడుచుకునే లాగా.. ఆయన క్యాబినెట్ సహచరులు కూడా చంద్రబాబు నాయుడు పట్ల భక్తి ప్రపత్తులను చాటుకునే లాగా కనిపిస్తోంది. ఏపీలో చంద్రభజన చేస్తున్న షర్మిలకు తోడుగా తెలంగాణ కాంగ్రెస్ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లుగా కనిపిస్తోంది.