ఏపీలో నరేంద్ర మోడీ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. ఏపీ కమలం పార్టీ చేతికి వస్తే డబుల్ ఇంజన్ పాలనతో స్టేట్ బాగుపడుతుందని ఆయన అంటున్నారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలన్నది బీజేపీ మొదటి నుంచి చెబుతోందని కన్నా అంటున్నారు. కర్నూల్ లో హై కోర్టు ఉండాలని కోరుకుంటున్నామని కూడా చెప్పారు. మరి కీలకమైన ప్రాంతం, అత్యంత వెనకబాటుతనానికి గురి అయిన ఉత్తరాంధ్రా విషయం మాత్రం బీజేపీ పట్టదా కన్నా గారూ అంటే ఏం చెబుతారో మరి అంటున్నారు అక్కడి జనాలు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే తమకు అప్పగించాలని వెంటనే పూర్తి చేస్తామని కన్నా అంటున్నారు. నిజానికి ఇది కేంద్ర ప్రాజెక్ట్. జాతీయ ప్రాజెక్ట్ గా పూర్తి స్థాయిలో నిధులు ఇస్తే ఈ పాటికే పూర్తి అయి ఉండేదిగా కన్నా సార్ అంటే జవాబు చెప్పగలరా అంటున్నారు.
విభజన తరువాత అన్ని విధాలుగా ఏపీకి అన్యాయం జరిగింది. అత్యంత వెనకబడిన ప్రాంతాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్రా ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని అంతా కోరుతున్నా కేంద్రం మాత్రం అసలు పట్టించుకోవడంలేదు. ఇపుడు అదే ఉత్తరాంధ్రా గడ్డ మీదకు కన్నా లాంటి బీజేపీ నేతలు వచ్చి విశాఖకు రాజధాని వద్దు అంటున్నారు. అమరావతిలోనే అంతా పెట్టాలని చెబుతున్నారు.
ఇదే బీజేపీ నినాదం అయితే ఉత్తరాంధ్రా ఏ విధంగా కమలం పార్టీ కొమ్ము కాయాలి, ఎందుకు ఆదరించాలి బీజేపీ పెద్దలూ అంటే వారు ఏమంటారో. విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్రా సహా అన్ని ప్రాంతాలు బాగుపడతాయి అంటున్న స్థానిక ప్రజా సంఘాలు బీజేపీ నేతల విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు.
వీటిని మించి కన్నా చేసిన మరో విమర్శ ఇపుడు రచ్చ అవుతోంది. రాయలసీమ జగన్ ఉత్తరాంధ్రాలో పాదయాత్రను ఆనాడు ఎలా చేశారని నిలదీస్తున్న కన్నా వారికి అర్ధం కానిది చాలానే ఉంది అంటున్నారు. విశాఖలో రాజధాని పెట్టవద్దని చేస్తున్న అమరావతి రైతుల పాదయాత్రకు జగన్ పాదయాత్రకు అసలు పోలిక ఉందా కన్నా మాస్టారూ అని వైసీపీ నేతలు అంటే ఆయన ఏమంటారో.