తన అన్న వైఎస్ మాట కాదని వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. వైఎస్సార్టీపీ అధినేత్రి అనిపించుకున్నారు. కానీ ఆమె ఆశయం తెలంగాణ సీఎం కావడం. చాలా మందికి రాజకీయంగా ఎన్నెన్నో ఆశలు ఉండొచ్చు. అయితే ఆశల్ని, ఆశయాల్ని కొందరు మాత్రమే నెరవేర్చుకోగలరు. ఇందుకు ప్రకృతి, భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక తదితర పరిస్థితులు అనుకూలించాలి.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టగానే అన్నీ అయిపోవు. ప్రస్తుతం ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారామె. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆమె పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. తెలుగు సమాజంలో షర్మిల మాదిరిగా ఒక మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్ కూతురిగా రాజకీయ అరంగేట్రానికి షర్మిలకు సులువు అయ్యింది. అయితే షర్మిల పోయిన చోట వెతుక్కోకుండా, మరెక్కడో అన్వేషిస్తోంది. ఇదే ఆమె రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.
సాధించాలనే పట్టుదల షర్మిలకు పుష్కలంగా ఉన్నాయి. ఇదొక్కటే రాజకీయంలో పైకి రావడానికి దోహదపడదు. ముఖ్యంగా భౌగోళిక, సామాజిక పరిస్థితులు అనుకూలించాలి. తెలంగాణ ఆవిర్భావం వెనుక బలమైన ఆంధ్రా వ్యతిరేకత వుంది. ఆంధ్రా వాళ్లు తమ ప్రాంతానికి వచ్చి దోచుకుంటున్నారనే ఆవేదన, ఆగ్రహం తెలంగాణ సమాజంలో వుంది. ముఖ్యంగా ఆంధ్రా పాలకులపై తెలంగాణ సమాజానికి ఒక రకమైన కసి వుంది. ఆంధ్రా పాలకుల సంతతి నుంచి వచ్చిన తనను తెలంగాణ సమాజం ఆదరిస్తుందని షర్మిల ఎలా అనుకున్నారో ఆమెకే తెలియాలి.
తెలంగాణలో షర్మిల పార్టీకి కనీస స్పందన కూడా లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో షర్మిల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలుకుని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల ఘాటు వ్యాఖ్యలకు నేతలు నొచ్చుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ ఆమె విమర్శలపై స్పందించకూడదని తెలంగాణ రాజకీయ నేతలు రాజకీయాలకు అతీతంగా ఒక నిర్ణయానికి రావడం విశేషం. ఇదే షర్మిలకు అసలు నచ్చడం లేదు.
తెలంగాణలో అసలు తన ఉనికినే గుర్తించకపోవడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో భాగంగా సంగారెడ్డికి వెళ్లినప్పుడు అలవాటు ప్రకారం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై షర్మిల నోరు పారేసుకున్నారు. ఆశ్చర్యకరంగా జగ్గారెడ్డి స్పందించారు. దీంతో షర్మిల ఆనందానికి అవధుల్లేవు. జగ్గారెడ్డి రూపంలో తన రాజకీయ ఉనికిని గుర్తించిన నాయకుడు దొరికాడని… ఆమె మరింత రెచ్చిపోయారు. జగ్గారెడ్డి మాదిరిగా తన తండ్రి వైఎస్సార్ ఏనాడూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి శీలం గురించి వెటకారం చేశారు.
దీంతో జగ్గారెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. రాజశేఖరరెడ్డి బిడ్డ అయితే ఏమ్? అంటూ ఆయన ప్రశ్నించారు. రాజకీయ వ్యభిచారం, శీలం అంటూ ఒక మగాడితో మాట్లాడ్డం కరెక్టేనా? అని జగ్గారెడ్డి నిలదీశారు. ఇలాగైతేనే స్పందిస్తున్నారని షర్మిల పసిగట్టారనే సంగతి జగ్గారెడ్డికి తెలియకపోవడం గమనార్హం. నోటికొచ్చినట్టు మాట్లాడితే కనీసం తనను గుర్తిస్తారని షర్మిల ఉద్దేశంగా కనిపిస్తోందనే విమర్శలు లేకపోలేదు.
కారణాలేవైనా ప్రస్తుతం తెలంగాణలో షర్మిల, జగ్గారెడ్డి మధ్య డైలాగ్ వార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగ్గారెడ్డికి మనసులో షర్మిల తప్పక కృతజ్ఞతలు చెప్పుకుని వుంటారు. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది నాయకుల్ని తిడుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. అలాంటిది తన విమర్శలపై జగ్గారెడ్డి స్పందించి విలువ ఇచ్చారనే కృతజ్ఞత షర్మిలకు వుంటుంది.
షర్మిల తనను ఎంత ఘాటుగా విమర్శించినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించరో జగ్గారెడ్డి తెలుసుకున్నట్టు లేదు. ఆ తత్వం బోధపడితే జగ్గారెడ్డి మరోసారి షర్మిల కామెంట్స్‌పై స్పందించరు. కానీ తన రాజకీయానికి దివంగత వైఎస్సార్ పరువు ఏమవుతున్నదో షర్మిల ఒక్కసారి ఆలోచిస్తే మంచిదని పౌర సమాజం హితవు చెబుతోంది.