ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య కాలంలో ఆవేశానికి లోనవుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే, ఏపీలో మాత్రం తన నేతృత్వంలో నిశ్చలంగా ఉండడంతో వీర్రాజులో ఆవేశం పొంగుకొస్తోంది. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై రెచ్చిపోయారు. రాజధానికి తాము వేల కోట్లు నిధులిచ్చినా ఎందుకు కట్టలేదని నిలదీయడం విశేషం.
చంద్రబాబుకు కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందన్నారు. అలాగే మరో రూ.4,500 కోట్లు అప్పు ఇప్పించినట్టు చెప్పుకొచ్చారు. మొత్తం కేంద్రం ఇచ్చిన రూ.6,500 కోట్లు ఏం చేశారని వీర్రాజు వీర్రావేశంతో ప్రశ్నించారు. ఇవాళ రైతులంతా రోడ్డు మీద నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఎవరు నడిపిస్తున్నారో సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు సింగపూర్, జపాన్, మలేషియా అంటూ ఏ వూరు వెళితే అది చెబుతూ కాలం గడిపారని విమర్శించారు.
రూ. 1800 కోట్లతో కేంద్రం ఎయిమ్స్ నిర్మించిందన్నారు. అయితే, కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ బాగుందో లేక చంద్రబాబు రాజధాని బాగుందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వీర్రాజు మండిపడ్డారు. రాజధాని పేరుతో వేల కోట్లు ఖర్చు చేశాడని తప్పు పట్టారు. ఇప్పుడు ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కోట్లు ఖర్చు చేసి రాజధాని ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలని చంద్రబాబును సోము వీర్రాజు నిలదీయడం ఆసక్తికర పరిణామం.
మరి కట్టని రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని బీజేపీ డిమాండ్ ఎందుకు చేస్తున్నదో వీర్రాజు సమాధానం చెప్పాల్సి వుంది. ఎందుకంటే అమరావతికి బీజేపీ గట్టి మద్దతు తెలుపుతోంది. ఏమీ లేని దానికి మద్దతు ఎందుకు ఇస్తున్నారో, ఎవరి కోసం ఇస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వీర్రాజుపై ఉంది.