ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎట్టకేలకు జాతీయ పార్టీలో కొనసాగే విషయమై డ్రామాకు ముగింపు పలికారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైఖరితో విసిగిపోయి పార్టీని వీడుతున్నట్టు స్పష్టత ఇచ్చారు. ప్రధాని మోదీపై జీవితాంతం అభిమానం వుంటుందని జాగ్రత్త పడ్డారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో చెబుతానంటూ… ఏ పార్టీలో చేరుతారనే విషయమై సస్పెన్ష్‌ను కొనసాగించడానికి మొగ్గు చూపారు.
కన్నా రాజకీయ పంథాపై ఆయన మనసులో ఏమున్నదో అమాయకులకు చెబితే నమ్ముతారు. టీడీపీలో చేరేందుకు ఆయన అన్ని రకాలుగా లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు ఆ పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. అయితే కన్నా తన రాజకీయ అనుభవాన్ని జనసేనను మోసగించేందుకు వాడుకుంటున్నారు. పవన్‌కల్యాణ్‌పై విపరీతమైన ప్రేమ కనబరచడంతో ఆయన జనసేనలో చేరుతారనే ఆశల్ని ఆ పార్టీ శ్రేణుల్లో కల్పించారు.
ఇదంతా కన్నా వ్యూహాత్మక ఎత్తుగడే. పవన్‌పై వలపు మాటలు నిజమని నమ్మితే…. అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. రాజకీయ భవిష్యత్ లేని జనసేనలో చేరేంత అజ్ఞానం కన్నాలో లేదు. అయితే పవన్‌పై ఆ ప్రేమ మాటలేంటి? అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. తాను కాపు నాయకుడు అయినప్పటికీ, జనసేనాని పవన్‌పై ఆ సామాజిక వర్గంలో పట్టు వుందని గుర్తించారు. దీంతో తాను ఏ పార్టీలో వున్నా కాపుల మద్దతును తన వైపు తిప్పుకునేందుకు మాత్రమే పవన్‌పై కన్నా అభిమానాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు.
పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ… నిజంగా ఆ మాటలు హృదయంలో నుంచి వచ్చి వుంటే, జనసేనలో చేరాలి. ఇప్పటికైనా ఆయనకు మించి పోయిందేమీ లేదు. జనసేనలో చేరి, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తీర్చిదిద్దడానికి కన్నా ఉపయోగపడాలి. అబ్బే… కన్నా అలా చేస్తారని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లెవరూ నమ్మరు. ఎందుకంటే కన్నా పక్కా పొలిటికల్ కెరియరిస్ట్. లాభనష్టాలు చూసుకుని మాత్రమే ఆయన అడుగులు వేస్తారు. పవన్‌పై వలపు మాటలు కూడా అందులో భాగమే. బాబుతో జత కట్టడమే తరువాయి.