మూడు రాజధానుల కోసం పోరాటం ఇపుడు మరో లెవెల్ కి చేరుకుంటోంది. ఇప్పటిదాకా మాటల దాకానే ఆగిన వైసీపీ నేతలు ఇపుడు చేతలకు దిగుతున్నారు. మూడు రాజధానుల కోసం ఈ రోజు విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు అయింది. దానికి మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్ చైర్మన్ గా ఎంపిక అయ్యారు. అలాగే కన్వీనర్ గా దేముడు మాస్టార్ బాధ్యతలు చేపట్టారు.
ఇక విశాఖ సహా ఉత్తరాంధ్రాలో ఉద్యమం ఉరికిస్తామని జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు. నాన్ పొలిటికల్ జేఏసీ కి వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ప్రెసిడెంట్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తున్నట్లుగా ధర్మశ్రీ ప్రకటించారు.
తాను స్పీకర్ ఫార్మెట్ లోనే తన రాజీనామాను జేఏసీ నేతలకు అందిస్తున్నాను అని ఆయన చెప్పారు. దమ్ముంటే ఉత్తరాంధ్రా కోసం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన తరువాత అచ్చెన్న తోనే తాను పోటీకి రెడీ అవుతానని ఆయన పేర్కొన్నారు.
వికేంద్రీకరణ మీద జేఏసీ ఇలా ఏర్పడడం ఏంటి అలా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి చేతలకు దిగిపోయారు. ఇదే సమావేశంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తన పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా నాన్ పొలిటికల్ జేఏసీ ఇక విశాఖలో భారీ ర్యాలీని నిర్వహించాలని చూస్తోంది.
అలాగే మండల, గ్రామా స్థాయిలో కూడా జేఏసీ కమిటీలు వేసి వికేంద్రీకరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే వేడిగా సాగుతున్న ఈ పరిణామాలతో ఉద్యమాలతో ఉత్తరాంధ్రా ఊగిపోవడం ఖాయమనే అంటున్నారు.