విశాఖపట్నం ఎవరు కాదన్నా ఇపుడు రాజకీయ రాజధానిగా మారిపోయింది. రాజధాని కాదు అంటున్న వారు కూడా ఇక్కడే రకరకాలైన విన్యాసాలు చేస్తూ తమ బలం సరిచూసుకుంటున్నారు. తాము వెనకబడితే వెనక్కిపోతామని భయంతో అయినా విశాఖను పదే పదే తలచుకుంటున్నారు.
ఇపుడు విశాఖ మీద కేసీఆర్ కన్ను పడింది అంటున్నారు. ఆయన భారత్ రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీని పెట్టారు. దానిని ఏపీలో విస్తరించాలనుకుంటున్నారు. భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఏపీ అటెన్షన్ అంతా ఒక్కసారిగా తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
బీఆర్ఎస్ లాంచింగ్ కి ఏపీలో ఆయనకు ఇపుడు సరైన వేదికగా విశాఖ కనిపిస్తోంది అంటున్నారు. విశాఖను కేసీఆర్ ఎంపిక చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన పూర్వీకులది విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతమని ఇప్పటికే ప్రచారంలో ఉన్న వార్తలు.
ఉత్తరాంధ్రా జిల్లాలలో కేసీఆర్ సామాజికవర్గం బలంగా ఉంది. అందువల్ల విశాఖలో సభ పెడితే భారీ ఎత్తున విజయవంతం అవుతుందని, అన్ని వర్గాల జనాలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారని బీఆర్ఎస్ వర్గాలు ఊహిస్తున్నాయట. ఉత్తరాంధ్రా నుంచే తన జాతీయ రాజకీయానికి బలమైన అడుగులు పడతాయని కూడా అంచనా కట్టి మరీ విశాఖ వైపు చూస్తున్నారు అని తెలుస్తోనంది.
ఇప్పటికి అందుతున్న సమాచారం బట్టి అన్నీ అనుకూలిస్తే సంక్రాంత్రి పండుగ తరువాత విశాఖలో బీఆర్ఎస్ లాంచింగ్ పేరిట అతి పెద్ద రాజకీయ సభను నిర్వహించడం ద్వారా ఏపీలో గ్రాండ్ ఎంట్రీకి కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. కేసీఆర్ కనుక విశాఖ వైపుగా అడుగులు వేస్తే ఈ సిటీ ప్రాధాన్యత మరింతగా రాజకీయంగా పెరగడం ఖాయమని అంటున్నారు.