ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టినప్పుడు ఏం మాట్లాడాలి? ఏ నాయకుడైనా సరే.. ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు.. దానికి తగినట్లుగా ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వెళ్లడం సహజం. అందులో ఎవ్వరినీ తప్పుపట్టలేం. కానీ.. రాహుల్.. భారత్ జోడో పేరిట సాగిస్తున్న యాత్రలో భాగంగా.. ఏపీలోకి అడుగుపెట్టినప్పుడు.. ఈ రాష్ట్రప్రజల్ని మురిపించడానికి మభ్యపెట్టడానికి, బురిడీ కొట్టించడానికి ఆయన చెబుతున్న మాటలే ఏవగింపు కలిగిస్తున్నాయి. తతిమ్మా ఆయన మాటలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రత్యేకహోదా విషయంలో ఆయన హామీలివ్వడం.. ఇతర విషయాలను కూడా నమ్మవద్దని సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది.
ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అమరావతి, పోలవరం సమస్యలు రెండూ నా దృష్టికి వచ్చాయని రాహుల్ చెప్పుకొచ్చారు. ఆయన చేతిలో ఏమీలేని, ఎప్పటికీ ఆచరణ సాధ్యం కాని హామీలు కూడా ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు తాము న్యాయం చేస్తామని అన్నారు. అది ఆయన చేతుల్లో లేదు. ఏదో ఇవాళ ఇక్కడ ఆ మాట చెప్పేసి.. ఢిల్లీ వెళ్లాక మర్చిపోవడం తప్ప ఇంకో లాభం లేదు. అదే రీతిగా, అమరావతికి కూడా స్ట్రాంగుగా మద్దతిచ్చేశారు. రైతులు భూములు ఇచ్చిన తర్వాత.. ప్రభుత్వం మూడు రాజధానులు అనడం.. ఆ రైతుల్ని అవమానించడమే అని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా తెలివిగా వీటన్నింటికీ కూడా ‘తాము అధికారంలోకి వచ్చిన తర్వాత’ అనే ముడిపెడుతున్నారు.
ఈ రెండింటినీ మించి ప్రత్యేకహోదా మాటెత్తుతున్నారు. ప్రత్యేకహోదాకు కూడా కృషి చేస్తారట. రాహుల్ మాటలు ఎలా నమ్మాలి. ఇవాళ మన వాకిట్లోకి వచ్చి మన పాట పాడుతున్నాడు.. రేపు మరో రాష్ట్రంలో అడుగుపెట్టి వారి పాట పాడుతాడు.. అంతే కదా. రాహుల్ కు అసలు ఏపీకి ప్రత్యేకహోదా ఇప్పించడం గురించి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా అనేది పలువురి సందేహం. ఎందుకంటే.. ప్రత్యేక హోదా గురించి ఆయన పార్లమెంటు వెలుపల ఏపీ నాయకులతో కంటితుడుపు మాటలు చెప్పడమే తప్ప.. పార్లమెంటు లోపల నిర్దిష్టమైన పోరాటం ఒక్కనాడు కూడా చేయలేదు.
రాష్ట్రాన్ని విభజించిన తమ ప్రభుత్వం ప్రత్యేకహోదాకు హామీ ఇచ్చింది.. మీరు ఎందుకు ఇవ్వరు.. అని సూటిగా ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఏదో అవకాశవాదంగా ఏపీ ప్రతినిధులు కలిసినప్పుడు చెప్పే కబుర్ల మాదిరి కాకుండా.. ఆయన పార్లమెంటులో దాని కోసం ఎన్నడైనా గళమెత్తారా? అలా చేయనప్పుడు.. హోదా విషయంలో రాహుల్ కూడా వంచిస్తున్నట్లే అనుకోవాలి. ఒక విషయంలో వంచించే నాయకుడు.. మిగిలిన హామీలను మాత్రం నిలబెట్టుకుంటాడని ఎలా అనుకోవడం?