నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఒకపుడు కాంగ్రెస్ నాయకుడు. మువ్వన్నెల జెండా మెడలో వేసుకుని కనిపించే ఆయన ఇపుడు పక్కా కాషాయధారి అయ్యారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ బంధం తెంచుకున్నాక ఆయన బీజేపీకి నిఖార్సు అయిన నేతగా అగుపించే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన చెప్పిన మాటలే తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ ని తెలంగాణా ప్రభుత్వానికి విక్రయించడం లేదని అన్నారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం వట్టిదేనని కొట్టి పారేశారు. విశాఖ ప్లాంట్ కేమీ నష్టం కలగదు అన్నట్లుగా బీజేపీ పాటే ఆయన పాడడం విశేషం.
మరి ఏమీ కాకుండా పోతే స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేయమని కేంద్రం ఎందుకు చెప్పదన్నది సీనియర్ మోస్ట్ లీడర్ కిరణ్ కి తెలియదా. అంత దాకా ఎందుకు ఆయన ఏపీకి హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని కేంద్రం చేత ఇప్పటికైనా కిరణ్ చెప్పించగలుగుతారా అంటే సందేహమే.
ఏపీకి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు తీర్చడం లేదు కానీ బహు గొప్పగా ఏపీకి కేంద్రం సాయం చేస్తోందని ఇంతకాలం సోము వీరాజు ప్రభృతులు మాట్లాడిన మాటలనే ఏపీకి వచ్చిన బీజేపీ కిరణ్ వల్లించడమే విడ్డూరం.
అంతటితో ఆయన ఆగలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తోంది అని చెప్పడం నిజంగా ఏపీ జనాలు ఎలా తీసుకుంటారో. ఏపీకి అంత మంచి సాయం కేంద్రం నుంచి అందితే జనాలు ఎందుకు ఆ పార్టీకి నోటా కంటే వెనక సీట్లో కూర్చోబెడతారో మాజీ సీఎం కి అర్ధమైనట్లుగా లేదు అని అంటున్నారు.
ఏపీలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉక్కు కర్మాగారానికే దిక్కు లేకుండా చేస్తున్న కేంద్రం తీరుని జనమంతా దుయ్యబెడుతూంటే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా బాగుంది అని చెప్పడమే ఆశ్చర్యకరం అంటున్నారు. బీజేపీ భేష్ అంటున్న కిరణ్ ఏపీలోని జగన్ సర్కార్ మీద మరో మారు ప్రత్యేకంగా స్పందిస్తాను అంటున్నారు. ఆయన వైసీపీ మీద చెప్పబోయేది ఏంటి అన్నది అందరికీ తెలుసు కాబట్టి దాని మీద ఎవరికీ ఆసక్తి అయితే ఉండదనే అనుకోవాలి.