తాళి కట్టిన భార్యపై అనుమానం వ్యక్తం చేసిన భర్తలున్నారు. కానీ ఇదే అనుమానం అక్రమ సంబంధం లో కూడా ఉంటుందా? చేసిందే అక్రమ సంబంధం, అందులో మళ్లీ అనుమానం. ఫలితంగా ఓ నిండు ప్రాణం పోయింది. హత్య చేసిన వ్యక్తి జీవితం జైలుకు పరిమితమైంది.
చిత్తూరు రూరల్ మండలం, మాపాక్షి పోస్టు, గాంధీ యానాది కాలనీకి చెందిన కస్తూరి ఏడాది కిందట తన భర్తను కోల్పోయింది. అదే గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి కస్తూరికి దగ్గరయ్యాడు. దాదాపు 6-7 నెలలుగా కస్తూరి-శ్రీరాముల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
సంబంధం బాగానే నడుస్తోంది కానీ, అదే టైమ్ లో శ్రీరాములుకు అనుమానం కూడా రోజురోజుకు పెరగసాగింది. కస్తూరి తనతో కాకుండా, మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందేమో అనేది శ్రీరాములు అనుమానం. ఆ అనుమానం కాస్తా కొన్ని రోజులుగా పెనుభూతంగా మారింది.
ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు శ్రీరాములు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా 2 రోజుల కిందట కస్తూరిని హత్య చేశాడు శ్రీరాములు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదుచేసిన పోలీసులు, శ్రీరాముల్ని అరెస్ట్ చేశారు. అలా ఓ అక్రమ సంబంధం, ఓ మహిళ ప్రాణాలు తీయగా, ఓ వ్యక్తి జీవితాన్ని జైలు గోడలకు పరిమితం చేసింది.