భుజాలెందుకు తడుముకోవడం?

పాతికలక్షలతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు సన్మానం చేయగలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీ మరణించిన మహానుభావుల సంస్మరణకు పాతిక వేలు ఖర్చు చేయలేకపోయింది అంటూ ఓ వార్త ప్రచురిస్తే కొందరు మేధావులు భుజాలు తడిమేసుకుంటున్నారు. అడ్డగోలుగా…

పాతికలక్షలతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు సన్మానం చేయగలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీ మరణించిన మహానుభావుల సంస్మరణకు పాతిక వేలు ఖర్చు చేయలేకపోయింది అంటూ ఓ వార్త ప్రచురిస్తే కొందరు మేధావులు భుజాలు తడిమేసుకుంటున్నారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధం లేని విషయాలతో విరుచుకుపడాలనుకుంటున్నారు. ఇలాంటి సన్మాన కార్యక్రమాల కవరేజ్ అంటే మీడియా కు ఇబ్బంది, అందుకే ఇలాంటి రాతలు అంటూ విషయాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారు.

అసలు టాలీవుడ్ లో అంతే..అంతే అన్న దాంట్లో ప్రస్తావించింది ఏమిటి? ఆర్ఆర్ఆర్ అస్కార్ విజేతలకు సన్మానం తప్పు కాదు. జరగాల్సిందే. జరపాల్సిందే. కానీ మరణించిన మహానుభావుల విషయంలో ఈ ఆసక్తి ఎందుకు లేదన్నదే విషయం..ప్రశ్న కూడా.

దర్శకుల సంఘం తన చాంబర్లో తాను చేసుకుని వుండొచ్చు. మరెందరో ఎవరి లెవెల్ లో వారు నివాళలు అర్పించి వుండొచ్చు. లేదనడం లేదు..కాదనడం లేదు. కానీ అడిగింది అది కాదు. ఛాంబర్ ఎందుకు చేయలేదు అని. దానికి సమాధానం చెప్పవచ్చు కదా? సంస్మరణ సభలు కాస్త గట్టిగా జరపాలంటే వాళ్ల కుటుంబీకుల అనుమతి కావాలా? వాళ్లను రమ్మన మంటే ఇబ్బంది పడొచ్చేమో? కానీ ఎవరికి వారు వారి వారి అభిమానం గట్టిగా చాటుదాం అంటే ఎవరు వద్దంటారు?

విశ్వనాధ్ సంస్మరణకు పీపుల్స్ మీడియా, సుబ్బరామిరెడ్డి స్పాన్సర్ కావాల్సి వచ్చింది అన్నాం తప్ప అదే తప్పు అనలేదు. అది దర్శకుల సంఘం చేసిందో, దర్శకులు ఇతర అభిమానులు కలిసి చేసారో, మొత్తం మీద పూనుకున్నది పీపుల్స్ మీడియానే కదా? అసలు పీపుల్స్ మీడియా అధినేతలు ఫోన్ చేసి, ఇలా చేస్తే బాగుంటుంది, అవసరం అయితే తాము ఓ చేయి వేస్తాం అన్న తరువాత కదా ఈ కార్యక్రమం షురూ అయింది.

అదే పీపుల్స్ మీడియా అధినేతలు ఫోన్ చేయకుండా ఈ కార్యక్రమం వుండేదా? పీపుల్స్ మీడియా అధినేతలు ఫోన్ చేసి పూనుకున్న తరువాతే అంతా మొదలైందని, అదే ఆఫీస్ లో వుంటూ, ఫోన్ అందుకున్నవారికి తెలియదా?  ఈ విషయం చెబుతున్నది దర్శకుల సంఘాన్ని అవమానించడానికి కాదు. అసలు ఆ వార్తలో దర్శకుల సంఘం ప్రస్తావన లేశమాత్రమే. వార్త ప్రస్తావన అంతా ఛాంబర్ గురించి కదా.

పోనీ ఆ కార్యక్రమం ఏమైనా సరిగ్గా జరగలేదని, కానీ కాశీవిశ్వనాధ్ లాంటి వారు బాగా చేయలేదని కానీ అన్నామా? లేదే? మరెందుకు ఈ ఉలికిపాటు. ఆ వార్త లో రెండే పాయింట్లు..ఒకటి ఆర్ఆర్ఆర్ సభకు ముంబాయి ఈవెంట్ ఏజెన్సీని రప్పించి మరీ చేసారే..మరి విశ్వనాధ్, కైకాల, జమున లాంటి వారి సంస్మరణ కు ఎందుకు చేయలేకపోయారు అన్నదే కీలకం. రెండో పాయింట్. చేసిన సభకు కూడా ఛాంబర్ ఖర్చు చేయలేదు. పీపుల్స్ మీడియా లాంటి వాళ్లు సహకరించారు అన్నదే

మరి ఈ రెండు పాయింట్లు వదిలేసి, కవర్లు లేవు అని అక్కసు..కవర్లు ఇస్తే కవరేజీ అంటూ ఏదోదో చెప్పుకువచ్చారు. కవరేజ్ లేదని ఎవరు చెప్పారు. ఆర్ఆర్ఆర్ సభను దాదాపు అన్ని మీడియా సంస్థలు తమ తమ యూ ట్యూబ్ చానెళ్లలో అధ్భుతంగా కవర్ చేసాయి.

శుభానికైనా, సంస్మరణ కైనా ఓ పద్దతి వుండాలి అన్నది జోక్ అంట. పెళ్లి మాత్రమే కాదు, సంవత్సరీకాలు కూడా అదే రేంజ్ లో చేసే సంస్కృతి మనది. చనిపోయిన వాళ్లను తలుచుకుని, వాళ్ల గురుతులు పదికాలాలు వుండేలా చూసే పద్దతి మనది.

మేధావుల సమాధానంలో తిట్లు, పరుషపదజాలం వాడితే వాడుకోవచ్చు. బ్యాన్ చేసేయండి, బయటకు తోసేయండి లాంటి సలహాలు ఇస్తే ఇవ్వొచ్చు. కనీసం ఈ ప్రయత్నం తాము పని చేస్తున్న పీపుల్స్ మీడియా సంస్థలో అయినా ట్రయ్ చేయండి. ఆ తరువాత ఇండస్ట్రీ మొత్తానికి పాకించవచ్చు. ''చాదస్తం పెరిగిపోయిందండీ…క్రాఫ్ట్ వదిలేసారు..ఇలాంటివి పట్టుకుంటున్నారు'' అదీ సదరు అధినేతల కామెంట్. అది తెలుసుకోవాలి ముందుగా. 

కానీ సమాధానం పద్దతిగా చెప్పాలన్నదే మా విధానం. మరికాస్త డిజిటల్ స్పేస్ వృధా అయినా. డిజిటల్ స్పేస్ కు కొలమానం లేదు. కానీ కాలానికి కొలమానం వుంది. ఇప్పటికైనా ఇలాంటి వాటితో కాలం వృధా చేయకుండా, గతకాలమె మేలు వచ్చు కాలము కంటెన్, తాతల మూతుల నేతులు అనిపించుకోకుండా, సరైన ప్రొడెక్ట్ ను డెలివరీ చేయడానికి ఆ కాలాన్ని వాడుకోవాలని మనవి.