దమ్ముంటే తమరు న్యాయం చేయరాదా పట్టాభీ!

తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, నిత్య మేకప్ లో కూర్చుని ఉంటూ, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందా.. జగన్ ప్రభుత్వాన్ని తలాతోకా లేకుండా తిట్టిపోయడానికి, విమర్శలు గుప్పించడానికి ఎగబడిపోదామా? అని ఎదురుచూస్తూ ఉండే  స్టాఫ్ ఆర్టిస్ట్…

తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, నిత్య మేకప్ లో కూర్చుని ఉంటూ, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందా.. జగన్ ప్రభుత్వాన్ని తలాతోకా లేకుండా తిట్టిపోయడానికి, విమర్శలు గుప్పించడానికి ఎగబడిపోదామా? అని ఎదురుచూస్తూ ఉండే  స్టాఫ్ ఆర్టిస్ట్ కొమ్మారెడ్డి పట్టాభి రాం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రధానంగా మూడు విషయాలపై వారికి రకరకాల హామీలు ఇచ్చింది.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సర్కారు చెప్పడం ఆ వర్గాల్లోని వారికి అతిపెద్ద మేలు. ఇందుకోసం కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్రవిభజనకు ముందునుంచి నిరీక్షిస్తూనే ఉన్నారు. ఇదే రెగ్యులరైజేషన్ విషయంలో వారికి మాయమాటలు చెప్పిన చంద్రబాబునాయుడు తన అయిదేళ్ల పాలన కాలంలో ఆ సంగతి పట్టించుకోలేదు. 

తెలంగాణలో రాష్ట్ర విభజన సమయానికి ఉన్న ఒప్పంద ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేసినా సరే.. చంద్రబాబు స్పందించలేదు. ఆయనలా పెండింగ్ లో పెట్టిన భారం జగన్ మీద పడింది. అయినా సరే వెరవకుండా.. విభజన సమయానికి అయిదేళ్ల సీనియారిటీ ఉన్న అందరినీ క్రమబద్ధీకరించనున్నారు. ఇలాంటి ఒక నిబంధన విధించడమే నేరం అన్నట్టుగా కొమ్మారెడ్డి విమర్శిస్తున్నారు. అసలేమీ చేయకుండా వారిని గాలికి వదిలేసి వంచించిన చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఎంతో మేలు చేస్తున్నట్టే కదా అనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది.

పీఆర్సీ విషయంలో కొమ్మారెడ్డి పట్టాభిరాం అజ్ఞానం మొత్తం బయటపడుతోంది. 11 వ పీఆర్సీకింద రావాల్సినవే ఇంకా పూర్తిగా రాలేదని, అప్పుడే 12వ పీఆర్సీ అంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని కొమ్మారెడ్డి అంటున్నారు. కొత్త పీఆర్సీ వేయడం అనేది చాలా క్రమంతప్పకుండా జరగవలసిన ప్రాసెస్ అని, దానివలన ఉద్యోగులకు మేలే తప్ప నష్టం ఉండదని పట్టాభికి అర్థమైనట్టు లేదు. 

ఇకపోతే.. పాత పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలో చెల్లిస్తామని జగన్ సర్కారు చెబితే.. వాయిదాల్లో ఇస్తారా.. అంటూ పట్టాభి ఆగ్రహిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి.. వారిని వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు.. గెలిచిన వెంటనే మాటమార్చి వాయిదాలుగా మార్చి.. ఆ వాయిదాలు చెల్లించకుండానే పతనం అయిపోయిన సంగతి పట్టాభి మర్చిపోయినట్టున్నారు.

పాత పెన్షన్ స్కీమ్ ను జగన్ సర్కారు తిరిగి తీసుకురాలేం అంటోంది. పట్టాభికి గానీ.. ఆయన భజన చేస్తున్న తెలుగుదేశం పార్టీకి గానీ ఉద్యోగుల మీద అంత ప్రేమ ఉంటే గనుక.. పాత పెన్షన్ పథకం తిరిగి తెస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటిస్తే సరిపోతుంది కదా.. అనేది ప్రజల అనుమానం.

చిత్తశుద్ధి గల మాటలు కాకుండా, ఉబుసుపోని అజ్ఞాన పూరితమైన మాటలతో జగన్ సర్కారు మీద బురద చల్లాలని అనుకుంటే.. పట్టాభికి ఎటూ క్రెడిబిలిటీ, పరువు లేకపోవచ్చు.. కానీ పార్టీకి ఉండేవి కూడా పోతాయని ఆయన తెలుసుకోవాలి.