పాపం.. మురిపెం తీరేలోగా.. ముప్పు వచ్చేసిందే!

కాంగ్రెస్ పార్టీకి ఇది అనూహ్యం అనలేం గానీ, ఇబ్బందికరమైన దెబ్బ. రాజస్తాన్ లో ఆ పార్టీ ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేసి చికాకు పెడుతున్న కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్…

కాంగ్రెస్ పార్టీకి ఇది అనూహ్యం అనలేం గానీ, ఇబ్బందికరమైన దెబ్బ. రాజస్తాన్ లో ఆ పార్టీ ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేసి చికాకు పెడుతున్న కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సొంత కుంపటి పెట్టుకోడానికి సిద్ధమవుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇది షాక్. ఈ ఏడాది చివర్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతుండగా.. అక్కడ అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని.. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలకు ముందు బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే సచిన్ పైలట్ సొంత పార్టీ పెట్టుకుంటే కాంగ్రెస్ ఆ దెబ్బనుంచి కోలుకోవడం కష్టం అవుతుంది.

వసుంధర రాజె ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో దీక్షలకు ఉపక్రమించారు సచిన్ పైలట్. గహ్లోత్ ప్రభుత్వం ఆయన డిమాండ్ ను పట్టించుకోలేదు. ఎట్టకేలకు సచిన్ పైలట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుంటున్నారు. తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి అయిన 11వ తేదీన కొత్త పార్టీని ప్రకటించబోతున్నరాట. అందుకోసం రెండు పేర్లను కూడా రిజిస్టరు చేయించారట. ప్రొగ్రెసివ్ కాంగ్రెస్, రాజ్ జన సంఘర్ష్ అనే పేర్లను సచిన్ పైలట్ రిజిస్టరు చేయించారని, ఒక పేరును 11న ప్రకటిస్తారని అంటున్నారు.

రాజస్తాన్ లో కీలక నాయకుడు అయిన సచిన్ పైలట్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకోవడం అనేది వారికి పెద్ద దెబ్బే. కర్ణాటక అసెంబ్లీని గెలుచుకుని కాంగ్రెస్ మంచి ఉత్సాహంగా ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణతో పాటు కాంగ్రెస్ ను కూడా గెలుచుకోవాలని వారు కలగంటున్నారు. అలాంటి సమయంలో సచిన్ పైలట్ వేరుకుంపటి నిర్ణయం ఖచ్చితంగా అశనిపాతమే.

గహ్లోత్ తో పైలట్ కు ఉన్న విభేదాలు ఇవాళ్టివి కాదు. తొలినుంచి కీచులాటలతోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. మధ్యలోపైలట్ వర్గం తిరుగుబాటు చేసి భాజపాలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. రాహుల్ ఉభయులతో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. అశోక్ గహ్లోత్ ను ఏఐసీసీ అధ్యక్షుడుగా చేయాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించినప్పుడు.. వీరి విభేదాలు మళ్లీ ముదిరాయి. 

సచిన్ పైలట్ కు వ్యతిరేకంగా గహ్లోత్ ముఠా రాజకీయాలు నడిపేసరికి.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహించి.. ఆయనను తిరిగి సీఎంగానే పంపింది. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య మళ్లీ సయోధ్య కుదిర్చి ఇద్దరితో కలిసి నడిచారాయన. కానీ ఈ గిమ్మిక్కులు ఏమీ పనిచేసినట్టు లేదు. ఇప్పుడు సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ సంక్షోభాన్ని కాంగ్రెసుపార్టీ ఎలా తట్టుకుంటుందో ఏమో.. వేచిచూడాలి.