నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలో గొప్ప నటుడున్నాడు. ఆయనలోని నటనా నైపుణ్యం గురించి చాలా పరిమితంగా మాత్రమే తెలుసు. శ్రీధర్రెడ్డిలోని నటుడిని మొట్టమొదట పసిగట్టిన ఘనత మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు దక్కుతుంది. ఎందుకంటే ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తూ వచ్చారు కాబట్టి. ఇటీవల అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ… శ్రీధరన్నా నువ్వు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చావని, లేదంటే గొప్ప నటుడివి అయ్యేవాడివని అనేక సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు.
ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు లాంటి నటులకంటే శ్రీధర్‌రెడ్డి తోపు అని అనిల్‌కుమార్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా మీడియా సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతున్న తీరు గమనిస్తే అంతా నాటకీయత స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాక్షన్ ఎక్కువైందనే భావన కలుగుతోంది. మరీ ఎక్కువైతే కేఏ పాల్, బండ్ల గణేశ్, పవన్‌కల్యాణ్ లాంటి వారి జాబితాలో చేరిపోయే ప్రమాదం వుందని ఆయన గ్రహిస్తే మంచిది.
తన లక్ష్యాలు వైసీపీలో నెరవేరకపోవడంతో మరో పార్టీని ఎంచుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్నెవరూ తప్పు పట్టరు. అయితే ఇంతకాలం ఆదరించిన పార్టీని, అధినాయకుడిని మాట్లాడుతున్న తీరు ఆయనకు రాజకీయంగా నష్టం కలిగించేలా వుంది. కోటంరెడ్డి తనలోని నటుడిని ఇప్పుడు తెలుగు సమాజం ముందు బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే మీడియా సమావేశంలో మాట్లాడే సందర్భంలో హావభావాలు, భావోద్వేగం, ఆగ్రహం, సవాళ్లు, నక్క వినయ విధేయతలు… ఇలా అన్ని రకాల పాత్రలను ఆయన సునాయాసంగా పోషిస్తున్నారనే విమర్శ లేకపోలేదు.
తన నటనను కనుక్కోలేని అమాయక స్థితిలో సమాజం లేదని కోటంరెడ్డి గ్రహిస్తే మంచిది. ప్రతిదీ డ్రామా అయితే అసలుకే ఎసరు వస్తుందని ఆయన పసిగడితే ప్రయోజనం వుంటుంది. గన్మెన్లను కుదించినందుకు కూడా రంకెలేస్తూ మాట్లాడితే, అయ్యో పాపం అనే వాళ్లెవరూ వుండరు. గన్మెన్లను తగ్గించి ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చిందని, అందుకు రిటర్న్ గిఫ్ట్‌గా ఉన్న ఆ ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి పంపుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇలాంటి బెదిరింపులు, అలకలకు జగన్ చలించరని బాగా తెలిసిన కోటంరెడ్డి, ఇప్పుడు ఎవరి కోసం ఈ నాటకాలో చెప్పాల్సిన అవసరం వుంది. ఎన్నికల ఫలితం ద్వారా గిఫ్ట్‌ను జగన్ పంపుతారు. దాని కోసం ఎదురు చూస్తూ కాస్త ఓపికగా మసలుకోవాల్సిన అవసరం ఉందని కోటంరెడ్డికి నెటిజన్లు హితవు చెబుతున్నారు.