ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని సీఎం అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు.
“కలిసికట్టుగా పనిచేయాలి, ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలి. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి. మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి” అని సీఎం జగన్ అన్నారు.
“పోయినసారి 151 సీట్లు గెలిచాం. ఈ మూడేళ్ళలో ప్రజలకు చాలా చేశాం. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఇంతకు ముందు ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. ఈ సారి 151 కంటే ఎక్కువ గెలవాలి. పోయిన సారి గెలవలేని ఆ సీట్లు ఈసారి గెలుద్దాం. కుప్పం గెలుస్తాం. కుప్పంలో పంచాయితీలు గెలిచాం. మున్సిపాలిటీ గెలిచాం. ఈసారి అసెంబ్లీ సీటు గెలుస్తున్నాం. వై నాట్?. మనమీద ఈసారి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మనల్ని ఓడించి వాళ్ళ ప్రభుత్వం తెచ్చుకోవాలని కుట్రలు చేస్తున్నారు. దుష్టచతుష్టయం పనిచేస్తోంది. మనం ఇంకా గట్టిగా పని చేయాలి”, అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మనసులో మాట చెప్పారు.