ఎన్నికలు దగ్గరపడడంతో ప్రధాన పార్టీలు తాయిలాల పంపిణీకీ తెరలేపాయి. అభ్యర్థుల ఆర్థిక స్తోమతను బట్టి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా ఓటుకు ధర పలుకుతోంది. కుప్పంలో ఓటు భారీ రేటు పలుకుతున్నట్టు సమాచారం. ఇరు పార్టీలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పంపకాలు చేపట్టాల్సిన పరిస్థితి. కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని అధికార పార్టీ పట్టుదలతో వుంది.
మరోవైపు కుప్పంలో గెలవడం చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అధికార పార్టీకి దీటుగా ఆయన కూడా ఓటుకు రేటు పెట్టాల్సిన అనివార్య పరిస్థితి. ఇంతకాలం చంద్రబాబు కుప్పంలో ఊరికే గెలుస్తూ వచ్చారు. కుప్పం ప్రజల అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని, వారికేవో మాయ మాటలు చెప్పి రాజకీయంగా చంద్రబాబు పబ్బం గడుపుకునే వారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
కానీ వై నాట్ 175, వై నాట్ కుప్పం నినాదాల్ని వైసీపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. కుప్పంలో గెలవడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపుతోంది. ఎన్నికలంటే ప్రధానంగా పోల్ మేనేజ్‌మెంటే. ఇంత కాలం ఎన్నికల ప్రచారం ఒక్క లెక్క. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు అభ్యర్థులు అనుసరించే విధానాలే …గెలుపోటములను నిర్ణయిస్తాయి.
ఈ క్రమంలో మంగళవారం నుంచి కుప్పంలో ఒక పార్టీ ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలు పెట్టింది. తాము బలంగా ఉన్న చోట ఓటుకు రూ.4 వేలు, బలహీనంగా వున్నామని భావించి, ఎలాగైనా మద్దతు పొందాలనే ఉద్దేశంతో ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిసింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఓటుకు రేటు పలకలేదని కుప్పం ఓటర్లు చెబుతున్నారు.
ఇరు పార్టీలు ఇదే స్థాయిలో ఓటర్లకు డబ్బు పంచితేనే, గెలుపుపై ఆశలు సజీవంగా పెట్టుకోవచ్చనే చర్చ కుప్పంలో జరుగుతోంది. అందుకు విరుద్ధంగా తనపై అభిమానంతో ఎప్పట్లాగే అమాయకంగా గంపగుత్తగ్గా ఓట్లు వేస్తారని అనుకుంటే మాత్రం… ఫలితం మరోలా వుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.