హెల్త్ యూనివర్సిటీకి దివంగత ఎన్టీఆర్ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయం దివంగత ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతిని ఇరకాటంలో పడేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయడం లక్ష్మీపార్వతిపై ఒత్తిడి పెంచింది.
లక్ష్మీపార్వతి గత కొన్నేళ్లుగా వైఎస్సార్‌సీపీలో ఉంటున్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అప్పుడప్పుడు లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా వైసీపీ లబ్ధి పొందుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆ తర్వాత ‘తెలుగు-సంస్కృత అకాడమీ’గా మార్చిన సంగతి తెలిసిందే.
హెల్త్ యూనివర్సిటీకి భర్త పేరు తొలగించినా లక్ష్మీపార్వతికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదా? అని టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారని, భార్య అయిన లక్ష్మీపార్వతి ఇంకా పదవి పట్టుకుని వేలాడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ వుంటే… ఇంత వరకూ లక్ష్మీపార్వతి ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మాత్రం లక్ష్మీపార్వతిని ఇబ్బందుల్లో నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తూ, భర్త కోసం నామినేటెడ్ పదవి వదులుకోలేరా? అంటూ ఆమెని గట్టిగా ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి నిర్ణయంపై ఉత్కంఠ నెలకుంది.