ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ వేడిని రగిల్చింది. హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ నామకరణం చేస్తూ ఇవాళ అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదించారు. ఇకపై హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్సార్ పేరుపై కొనసాగనుంది. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లుపై చర్చలో భాగంగా సీఎం జగన్ గట్టి వాదన వినిపించారు.
ఎన్టీఆర్ పేరు మార్చడం సరైందేనా? అని తనను తాను ప్రశ్నించుకున్నట్టు జగన్ చెప్పడం గమనార్హం. అన్నీ ఆలోచిస్తే… తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టడమే సబబనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అది ఏ విధంగా సరైందో జగన్ చెప్పిన లాజిక్ ఆసక్తికరంగా వుంది. దివంగత ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే తనకే ఎక్కువ ప్రేమ, గౌరవమని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌పై తనకు ఎలాంటి కోపం లేదన్నారు.
అయితే వైద్యానికి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరు పెట్టడం సరైందన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాల కూడా ఏపీలో పెట్టలేదన్నారు. 1983కు ముందు 8 వైద్య కళాశాలలు, ఆ తర్వాత తన తండ్రి వైఎస్సార్ హయాంలో 3 వైద్య కళాశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యాయన్నారు.
వైఎస్సార్ తనయుడిగా తన పాలనలో 17 వైద్య కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వృత్తిరీత్యా వైఎస్సార్ గొప్ప డాక్టరన్నారు. పులివెందులలో వైద్యుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని ఆయన అన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం డాక్టర్ వైఎస్సార్ అని జగన్ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్‌గా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ అని అన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.
ఇలా ఏ విధంగా చూసినా ఏపీలో వైద్యరంగానికి పెద్దపీట వేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. చేయని పనికి ఎన్టీఆర్ పేరును తెలుగుదేశం హయాంలో పెట్టారని ఆయన అన్నారు. నిజంగా ఎన్టీఆర్ హయాంలో లేదా టీడీపీ పాలనలో ఏవైనా గొప్ప కార్యాలు చేసి వుంటే, తన దృష్టికి తీసుకొస్తే ఎన్టీఆర్ పేరు పెట్టడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని జగన్ స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారని జగన్ ప్రశ్నించారు. ఇదే ఈనాడు రామోజీరావుకు పురస్కారాలు ఇప్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ విషయంలో ఆయన మీద ఎలాంటి కల్మషం లేదని, ఎవరూ అడగకపోయినా ఆయన పేరు మీద జిల్లా పెట్టామని గుర్తు చేశారు. జగన్ లాజిక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమర్థించే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు వర్గాలుగా విడిపోయి తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు.