మహిళలపై ప్రేమ ఉంటే మాయ తగ్గించు చినబాబూ!

ఒక్కసారిగా అందరికీ ఇప్పుడు మహిళలపై ప్రేమ పొంగుకొస్తున్నట్లుగా ఉంది. మహిళా ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టాలనే కోరిక పెరుగుతున్నట్లుగా ఉంది. తాము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ…

ఒక్కసారిగా అందరికీ ఇప్పుడు మహిళలపై ప్రేమ పొంగుకొస్తున్నట్లుగా ఉంది. మహిళా ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టాలనే కోరిక పెరుగుతున్నట్లుగా ఉంది. తాము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రకటించింది.  

ఇప్పుడు చినబాబు నారా లోకేష్.. మహిళా రిజర్వేషన్ బిల్లును సభ ఆమోదం పొందేలా చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంటులో పోరాడుతుందని గప్పాలు కొడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మహిళా లోకాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. కానీ చట్టసభల్లో రిజర్వేషన్ దిశగా మహిళా లోకం పై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దానిని నిరూపించుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి.

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చేస్తున్న హామీలు కొన్ని చిత్రంగా కనిపిస్తున్నాయి. తన చేతిలో లేని వ్యవహారాలపై తాను హామీలు ఇవ్వడం ఎవరిని మోసం చేయడానికో  అర్థం కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చడం అనేది అంత సులువైన సంగతి కాదు. పార్లమెంటులో అధికారంలో ఉండే పార్టీ పూనుకుంటే, విపక్షాలు కూడా సహకరిస్తే మాత్రమే జరుగుతుంది. తమ పార్టీ సహకరిస్తుంది, పోరాడుతుంది.. అనే పడికట్టు పదాలు చెప్పడం తప్ప.. మహిళా బిల్లు విషయంలో లోకేష్ ఎలాంటి భరోసా ఇవ్వగలరు? అసాధ్యం.  

తెలుగుదేశం అంటే కేవలం 3 ఎంపీ సీట్లు కలిగి ఉన్న పార్టీ. ఒకవేళ రాష్ట్రమంతా వారిని నెత్తిన పెట్టుకుంటుంది అని భావించినా సరే 25 సీట్లు మించవు. ఈ బలంతో పార్లమెంటులో బిల్లును ఎలా ముందుకు తీసుకెళ్లగలరు?

తాము అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తాం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీతో మీలాఖత్ కావడానికి  లోకేష్ ఈ మాటల ద్వారా సంకేతాలు ఇస్తున్నారా అనే అనుమానం కొందరికి కలుగుతుంది. అయినా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టయితే దానిని చాలా స్పష్టంగా నిరూపించుకోవచ్చు. ఆ బిల్లు చట్ట రూపంలో రావలసిన అవసరమే లేదు.  

రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో గాని, పార్లమెంటు ఎన్నికల్లో గాని తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులలో 33 శాతం టికెట్లను మహిళలకు కేటాయిస్తే గనుక ఈ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు అవుతుంది.  కాంగ్రెస్, తెలుగుదేశం అని మాత్రమే కాదు.. ఏ పార్టీ అయినా సరే మహిళా రిజర్వేషన్ బిల్లు అనే మాటను ప్రస్తావించాలంటే.. ఆ అర్హత వారికి ఉండాలి అంటే.. ముందుగా వారి పార్టీలో అంతర్గతంగా ఆ ఏర్పాటును అనుసరించాలి.  

టికెట్ల కేటాయింపులో తూకం పాటించాలి. అలాంటి పార్టీని మాత్రమే మహిళలు నమ్మాలి. అలా చేసినప్పుడు మహిళలను కచ్చితంగా పార్టీ చిత్తశుద్ధిని నమ్ముతుంది. అలా నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్లకుండా.. సభలో ఎదురుగా మహిళలు కనిపిస్తే ఎధాలాపంగా వారిని మాయ చేసేద్దామని.. మహిళా బిల్లు ప్రస్తావన తెస్తే ఉపయోగం లేదు.