శోభు యార్లగడ్డ ..బాహుబలి నిర్మాత..ఇప్పటికీ రాజమౌళి పక్కనే వుంటారు. సాయి కొర్రపాటి…ఈగ సినిమా నిర్మాత. రాజమౌళికి చాలా విధాల సన్నిహితుడు. డివివి దానయ్య. ఆర్ఆర్ఆర్ నిర్మాత. కానీ ఎక్కడా కనిపించరు. వినిపించరు. కనీసం ట్వీట్ ల్లో కూడా బ్యానర్ పేరు వుండదు. నిర్మాత పేరు వుండదు. అస్సలు రాజమౌళి అండ్ కో కి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ నిర్మాత వున్నారన్న వైనం కూడా గుర్తు వున్నట్లే లేదు.
ఒక సినిమా మెటీరియలైజ్ కావాలంటే నిర్మాత చాలా కీలకం. రాజమౌళి గొప్ప దర్వకుడే కావచ్చు. బోలెడు లాభాలు సంపాదించి పెట్టగల సమర్దుడే కావచ్చు. హీరోలు ఆయనను చూసే డేట్ లు ఇచ్చి వుండొచ్చు. ప్రొడెక్ట్ క్వాలిటీ అంతా ఆయనదే కావచ్చు. కానీ నిర్మాత అనే వాడు కూడా కీలకమే. వందల కోట్లు అప్పు తెచ్చి, సంతకాలు పెట్టి, టెన్షన్ పడుతూ నిద్రలేని రాత్రులు గడిపేది నిర్మాతనే కదా?
ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ దాదాపు రెండు నెలలుగా అంతర్జాతీయ వేదికల చుట్టూ తిరుగుతోంది. ఒకసారి కాకుండా ఒకసారి అయినా నిర్మాత దానయ్య కనిపించలేదు. సరే, ఆయనకు ఆసక్తి లేదు అనుకుందాం. కానీ ఆయన పేరు చెప్పాల్సిన బాధ్యత రాజమౌళి మీద వుంది కదా? రాజమౌళి ఫ్యామిలీ ఫ్యామిలీకి రెమ్యూనిరేషన్లు ఇచ్చింది దానయ్యనే కదా? కనీసం ట్విట్టర్ లో ట్వీట్ లు వేసినపుడయినా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ ను ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదా? రేపు ఏ వేదిక మీద అయినా బెస్ట్ ఫిల్మ్ అవార్డు వస్తే నిర్మాతగా దానయ్య అందుకుంటారా? దాన్ని కూడా తన సోదర, కుమార సమేతంగా రాజమౌళే వెళ్లి అందుకుంటారా?
అసలేం జరిగింది?
అసలు ఆర్ఆర్ఆర్ టీమ్ లో నిర్మాత దానయ్య కనిపించకపోవడం మీద పలు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికల మీద ఆర్ఆర్ఆర్ ను ప్రమోట్ చేయడానికి యాభై కోట్ల ఖర్చు అవుతాయని రాజమౌళి అండ్ కో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై దానయ్య పూర్తి అనాసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. దాంతో రాజమౌళి ఈ భారం తన మీద వేసుకున్నట్లు తెలుస్తోంది.
జపాన్, రష్యాల్లో విడుదలకు సంబంధించి వచ్చిన ఆదాయాన్ని ఇటు మళ్లించేట్లుగా ఒప్పందం ఏదో కుదిరిందనే టాక్ వినిపిస్తోంది. ఆ మేరకు రాజమౌళి అండ్ కో ఖర్చు చేసుకుంటూ వెళ్తున్నారని బోగట్టా.
గోల్డెన్ గ్లోబ్ కు 17 కోట్లు?
ఒక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించే 17 కోట్లు మేరకు లయిజనింగ్ కు, టికెట్ లకు, పార్టీలకు, ప్రమోషన్లకు ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు టోటల్ ఖర్చు 8 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా 65 నుంచి 70 కోట్ల మేరకు అయిందని తెలుస్తోంది.
మొత్తం మీద తొలిసారి ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికల మీద హడావుడి చేయడానికి ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం జరుగుతోందనుకోవాలి. అయితే ఇక్కడ రాజమౌళికి నష్టం లేదు. ఎందుకంటే మహేష్ తో చేసే సినిమాను అంతకు అంతా మార్కెట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం అంతా అక్కడ రాబట్టేయవచ్చు.