కేసీఆర్‌ను లాక్ చేయడం బిజెపికి సాధ్యమేనా?

కేసీఆర్– భారాస వేస్తున్న అడుగులను చూసి కమలదళం భయపడుతున్నదా? కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం వలన, కాన్సంట్రేట్ చేయడంవలన తమకు నష్టం ఉన్నదని భావిస్తున్నదా? అలా జరగకుండా ఉండాలంటే.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్…

కేసీఆర్– భారాస వేస్తున్న అడుగులను చూసి కమలదళం భయపడుతున్నదా? కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం వలన, కాన్సంట్రేట్ చేయడంవలన తమకు నష్టం ఉన్నదని భావిస్తున్నదా? అలా జరగకుండా ఉండాలంటే.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఉండే పరిస్థితి సృష్టించాలని వ్యూహరచన చేస్తున్నదా? రాష్ట్ర రాజకీయాలమీద నుంచి పక్కకు దృష్టి మరల్చలేనంతగా కేసీఆర్‌ను ‘లాక్’ చేస్తే.. జాతీయ రాజకీయాల్లో తాము నిమ్మళంగా ఉండ‌చ్చునని తలపోస్తున్నదా? హడావుడిగా తెలంగాణ నాయకులందరినీ పిలిపించి,  ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేయడం వెనుక అసలు ఎజెండా ఇదేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. 

కేసీఆర్– భారసకు ముచ్చెమటలు పట్టేలా తెలంగాణలో బిజెపి యుద్ధం ప్రకటించి ముందుకు దూసుకెళుతున్న సంగతి అందరికీ తెలుసు. కేసీఆర్ ను ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగా వారు స్ట్రీట్ కార్నర్ సమావేశాలు అంటూ రోజువారీ సభలకు పిలుపు ఇచ్చారు. కొన్ని వారాలుగా ప్రతిరోజూ ఏదో వీలైనన్ని నియోజకవర్గంలో వీధిలోనే సాయంత్రంపూట చిన్న సమావేశం ఏర్పాటుచేసి.. కేసీఆర్ సర్కారును తిట్టిపోయడం చేస్తున్నారు. అలాంటి స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు మంగళవారం ముగింపురోజు. ఆ సందర్భంగా చాలా ఘనంగా పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని కూడా వారు ప్లాన్ చేశారు. 

వీరి సమావేశాల పోరాట ప్రణాళిక పార్టీ అధిష్టానికి తెలుసోలేదో గానీ, లేదా, వారి పోరాటాలంటే చులకనభావం ఉన్నదో ఏమో గానీ.. హఠాత్తుగా ఢిల్లీ అమిత్ షాతో సమావేశానికి తరలి రావాల్సిందిగా నాయకులందరినీ పురమాయించారు. ఈ స్ట్రీట్ కార్నర్ సమావేశాలను క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్లారు. అంత అర్జంటుగా ఏమొచ్చింది? అంటే.. కేసీఆర్ ఫ్యాక్టర్ బిజెపికి భయం పుట్టిస్తున్నదా అనిపిస్తోంది. 

జాతీయ రాజకీయాల్లో పార్టీలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. భాజపాయేతర కూటమికి తాను మాత్రమే సారథ్యం వహించగలనంటూ కాంగ్రెస్ బీరాలు పలుకుతోంది. అందరినీ ఒక్కతాటిమీదకు తేవడానికి తన ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. కాంగ్రెస్ కూడా లేని కూటమి కావాలని కోరుకుంటున్న కేసీఆర్ మరోవైపు చాపకింద నీరులా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఎంత ఎక్కువగా కాన్సంట్రేట్ చేసేకొద్దీ అంతగా తమకు నష్టం తప్పదని మోడీదళం భావిస్తున్నట్టుంది. 

అందుకే తెలంగాణలో జోరు పెంచాలని, అసెంబ్లీ ఎన్నికల పర్వం పూర్తయ్యేదాకా కేసీఆర్ కు ఊపిరాడనివ్వని పరిస్థితి కల్పించాలని వారు అనుకుంటున్నారు. నా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ, అక్కడ అధికారంలోకి రావడమే అని అమిత్ షా చెబుతున్నారంటే.. అధికారంలోకి రాకపోయినా సరే.. ఆ స్థాయి కష్టం పడాలన్న సంకేతం అందుతోంది. మరి ఇలాంటి లెక్కలన్నీ ముందే వేసుకుని ఉండగల కేసీఆర్ ను .. రాష్ట్ర రాజకీయాల్లో ‘లాక్’ చేసి జాతీయరాజకీయాలవైపు చూడకుండా వారు చేయగలరా? 

ఇప్పటికే రాష్ట్ర పార్టీ రాజకీయాల్నిపట్టించుకోవడం మానేసి పూర్తిగా కొడుకు చేతిలో పెట్టేసిన కేసీఆర్, బిజెపి వ్యూహానికి లొంగుతారా అనేది వేచిచూడాలి.