ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఈ దఫా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. జీడీనెల్లూరు నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వయసు పైబడిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని, కూతురిని తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. కానీ నారాయణస్వామి కూతురికి టికెట్ లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి నారాయణస్వామే బరిలో ఉండనున్నారు.
అయితే జీడీనెల్లూరు టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. జీడీనెల్లూరులో జగన్ సామాజిక వర్గం ఓట్లు అధికారం. దీంతో ఎన్నిక ఏదైనా వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే. గతంలో కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గం కంచుకోటగా వుండేది. ఇప్పుడా ఓట్లన్నీ వైసీపీ వైపు మళ్లాయి. ఆ సామాజిక వర్గాన్ని కించపరిచేలా నారాయణస్వామి పదేపదే పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయనపై వారంతా గుర్రుగా ఉన్నారు.
నారాయణస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ కాదు, కూడదని ఇస్తే ఓడించితీరుతామని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ, నారాయణస్వామిపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి దివంగత కుతూహలమ్మ సమీప బంధువును అక్కడ బరిలో నిలపాలని చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దాయన ఆలోచనగా చెబుతున్నారు.
గెలుపే ప్రాతిపదికగా ఈ దఫా సమూల మార్పులను చేపట్టేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రజల్లో అనుకూలతలు లేని నాయకులను మార్చేందుకు జగన్ ఏ మాత్రం వెనుకాడరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారాయణస్వామిని ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి నారాయణస్వామిని బరిలో నింపాలని ఇప్పటికే పార్టీ పెద్దలు ఓ అవగాహనతో ఉన్నారని తెలిసింది.