ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ గుణపాఠం నేర్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబునాయుడు, లోకేశ్ తరచూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు బిజీగా వుంటే, లోకేశ్ ఏదో ఒక సమయంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పింది వినడంతో పాటు సమస్యల పరిష్కారానికి చంద్రబాబు, లోకేశ్ చొరవ చూపుతున్నారు. అలాగే టెలీకాన్ఫరెన్స్‌లో బూత్‌లెవెల్ టీడీపీ నాయకులతో చంద్రబాబు, లోకేశ్ నేరుగా మాట్లాడుతూ వారిలో జోష్ నింపుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని, నాయకుల్ని వైఎస్ జగన్ గాలికి వదిలేశారు. ఏనాడూ మండల స్థాయి పార్టీ సమావేశాన్ని నిర్వహించిన దాఖలాలు లేవు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బటన్ నొక్కడంలో లీనమై, ప్రజలంతా తన వెంట ఉన్నారనే మాయంలో గడిపారు. ఏ పార్టీకైనా కేడరే బలమనే వాస్తవాన్ని విస్మరించిన పాపానికి జగన్ భారీ మూల్యం చెల్లించారు. వైసీపీ ఘోర పరాజయం పొందడానికి కారణాల్ని టీడీపీ విశ్లేషించింది. కేడర్‌ను, అలాగే ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే దారుణమైన ఫలితాలొచ్చాయనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని తాము చేయకూడదని టీడీపీ గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.తనకు కార్యకర్తలే ముఖ్యమనే సంకేతాన్ని ఆయన పంపారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు, లోకేశ్ నడుచుకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చెబుతున్నారు.
ఊరికే మాట్లాడ్డమే కాకుండా, వారికి ఏవైనా ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా చర్యలు తీసుకుంటే మాత్రం, టీడీపీ మరింత బలపడే అవకాశం వుంది. ఉత్తుత్తి మాటలతో సరిపెడతామని అనుకుంటే మాత్రం… వారు సంతృప్తి చెందే పరిస్థితి వుండదు.