ఏదైనా ఒక పని చేసే వ్యక్తులు, ఇష్టాయిష్టాలను బట్టి పిలుస్తుంటారు. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా కనపడుతోంది. మీడియా బలం, ప్రచారం చేసుకునే శక్తిసామర్థ్యాలు ఆధారపడి వుంటాయి. మంచీచెడులనేవి లేవనే భావన ఇటీవల కాలం బలపడుతోంది. చెడ్డ పనిని కూడా మంచి అని నమ్మించే టాలెంట్ వున్న వాళ్లదే రాజకీయాల్లో పైచేయిగా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు చేస్తే సంసారం, ఆయన ప్రత్యర్థులు చేస్తే వ్యభిచారమా… అని తరచూ వింటుంటాం. ఔను, చంద్రబాబు చేస్తే సంసారమే మరి. ఇందులో రెండో మాటే లేదు. ఎందుకంటే వైఎస్ జగన్‌కు ఆరాటమే తప్ప, విచక్షణ ఉండదు. ఒక పని చేసే ముందు, ఎలా చేయాలి? ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే కసరత్తు కనిపించదు. అందుకే జగన్ చేసిన మంచి పనులు కూడా చాలా వరకూ టీడీపీ విజయవంతంగా చెడుగా క్రియేట్ చేసి, ప్రజల్ని నమ్మించగలిగింది. జగన్ సర్కార్ విపరీతంగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని శ్రీలంక, వెనుజులా తదితర దేశాల మాదిరిగా తయారు చేసిందని టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసి, జనంలోకి తీసుకెళ్లింది. దీంతో జగన్ సర్కార్ అంటే జనం భయపడే వాతావరణాన్ని సృష్టించింది.
జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అలివికాని హామీల్ని ఇచ్చారు. బాబు లక్ష్యం ఒక్కటే… ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఆయన లక్ష్యం నెరవేరింది. పవన్‌కల్యాణ్ చెప్పినట్టు… హామీల్ని నెరవేర్చే పెద్ద బాధ్యత కూటమి ప్రభుత్వంపై వుంది. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామనే హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలుపుకుంది. మిగిలిన సంక్షేమ పథకాల ఊసే ఎత్తడం లేదు.
ఇదిలా వుండగా 20 రోజుల వ్యవధిలో రూ.7 వేల కోట్లు చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. గతంలో జగన్ సర్కార్ అప్పులు చేస్తే గగ్గోలు పెట్టారని, ఇప్పుడు బాబు సర్కార్ చేయడాన్ని ఏమంటారని వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రశ్నిస్తోంది. సంపదన సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు.
అయితే రూ.7 వేల కోట్లను సాధించడం కూడా సంపదతో సమానమని, అప్పులు అనకూడదని సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. బాబు తానిచ్చిన హామీల్ని అమలు చేస్తున్నారా? లేదా? అనేది మాత్రమే చూడాలని, మిగిలిన వాటితో పనేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. రూ.7 వేల కోట్లు అప్పు తేవడం కూడా తమ బాబు ఘనతగా టీడీపీ చెబుతోంది. చంద్రబాబు చేస్తున్నది అప్పుగా భావించకపోవడం వల్లే టీడీపీ అనుకూల మీడియా నోరెత్తడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. దీన్ని సంపదగా చూడాలని వారు కోరుతున్నారు.