అప్పులు చాలా ఉన్నాయని, రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పెంచిన పింఛన్ సొమ్ము పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పాముల నాయక్ కు అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
అప్పులు చాలా ఉన్నాయని, రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. గత పాలన చూసి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బ్రాండ్ పడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తి పాలన చేశాడని జగన్పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు పాలన ఎలా చేయాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై వుందన్నారు.
తన పాలనలో ఎలాంటి హడావుడి వుండదన్నారు. ప్రజలతో మమేకం కావడమే తన ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇవాళ పంపిణీ చేస్తున్న పెన్షన్లు చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఒక్క పెనుమాక గ్రామంలోనే రూ.1.20 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. 28 రకాల పెన్షన్లకు రూ.4,408 కోట్లు రాష్ట్రంలో ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.