పార్టీ మార్పుపై మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఫలానా ఎమ్మెల్యే నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సబితా కుమారుడు కార్తీక్‌రెడ్డికి రేవంత్‌రెడ్డితో మంచి అనుబంధం వుంది. అందుకే సబితా పార్టీ మార్పు ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. పార్టీ మార్పు ప్రచారంపై సబితా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌లో చేరిక ప్రచారాన్ని ఆమె కొట్టి పారేశారు.
ఎక్స్‌లో ఆమె పెట్టిన పోస్టు సారాంశం ఏంటంటే… “నేను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాకు సముచిత స్థానం కల్పించారు. పార్టీ మారాల్సిన అవసరం, ఆలోచన నాకు ఏ మాత్రం లేదు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాను” ట్వీట్ చేశారు.
అయితే గతంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సబితా… ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. అందుకే ఆమె పార్టీ మారనని చెబుతున్నా, నమ్మలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సహజంగా తమపై వచ్చే ప్రచారాన్ని మొదట్లో ఇట్లే తిప్పి కొట్టడం సర్వసాధారణమని అంటున్నారు. సబితా పార్టీ మార్పుపై కాలమే జవాబు చెప్పాల్సి వుంది.