ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా ఏది చూసినా, ఆంధ్రలో పింఛన్లు పండుగ. నేరుగా గడప వద్దకే పింఛన్లు.. తెగ హడావుడి. పింఛన్లు వెయ్యి పెంచారు. మూడు నెలల అరియర్స్ ఇస్తున్నారు. ఈ రెండూ గొప్ప విషయాలే సందేహం లేదు. కానీ ఇంటికి పట్టుకెళ్లి పింఛన్లు ఇవ్వడం, ఠంచన్ గా ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వడం కొత్తగా చేస్తున్నారా? లేదే? గతం అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం చేసింది ఇదే కదా.
మరి అప్పుడు ఈ డిజిటల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడికిపోయాయి. అప్పుడు పండగ వాతావరణం కనిపించలేదా? మనవాడు అయితే ఒకలా.. పగవాడు అయితే మరోలా వార్తలు వండి వార్చడమేనా పని?
సరే, ఆ సంగతి అలా వుంచుదాం. జగన్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. వాలంటీర్ ఉద్యోగాలు అసలు ఉద్యోగాలే కాదు అంటూ వచ్చారు కదా. మరి ఇప్పుడు ఇంటిటికి ఎవరు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు. అసలు సచివాలయ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేసారు. ఆ వ్యవస్థ లేకుంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం అయ్యేనా?
మరి ఆ ఉద్యోగాలు కల్పించింది జగన్ కదా? కానీ వున్న ఒకటి రెండు మంచి పనులు అయినా అంగీకరించాలి కదా. క్రెడిట్ ఇవ్వాలి కదా. కలియుగం కదా.. నలుగురు కలిసి మేక అంటే మేక.. కుక్క అంటే కుక్క.. ఇప్పుడు ఆ నలుగురు ఎవరు అంటే.. తెలుగుదేశం అనుకూలంగా వ్యవహరించే మీడియా అనే అనుకోవాలేమో?