టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే పార్టీకి చెందిన ఇద్దరికీ భయం, భక్తి లేవా? అనే ప్రశ్న పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వీల్ చైర్‌లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీపై ఆయన నిబద్ధతను నేతలు ప్రశంసంచారు.
ఇదే సందర్భంలో సమావేశానికి హాజరుకాని ఇద్దరు ముఖ్యనేతలపై నేతలు చర్చించుకోవడం విశేషం. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సమావేశానికి హాజరు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారని, మొహమాటం లేకుండా నేతలకు క్లాస్ తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చర్చించుకోవడం గమనార్హం.
కానీ పార్టీలో కీలక నాయకుడైన లోకేశే సమావేశానికి రాకపోవడం ఏంటనే ప్రశ్నలు చక్కర్లు కొట్టాయి. అలాగే గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అధినేతతో సమావేశానికి కూడా గైర్హాజరయ్యారని, ఇలాంటి నేతలు పార్టీకి అవసరమా?
చంద్రబాబు ఎందుకని ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారో అర్థం కావడం లేదనే చర్చ నేతల మధ్య జరిగింది. ఇలాగైతే పార్టీ బతికి బట్ట కట్టేదెట్టా? అనే చర్చ కూడా జరిగింది. మొత్తానికి లోకేశ్, గల్లా జయదేవ్ తీరుపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై వీరికి సీరియస్‌నెస్ లేదని రుజువైందని అంటున్నారు.