వైసీపీ ప్రభుత్వం కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వుంది. కానీ దాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సొమ్ము చేసుకోవడం లేదని రెండు రోజుల క్రితం చెప్పుకున్నాం. అదే విషయాన్ని, టీడీపీ బలహీనతల్ని స్వయంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే బయట పెట్టారు. టీడీపీలో లోపాల్ని సరిదిద్దుకోకపోతే ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్లే అని చంద్రబాబు మాటలే చెబుతున్నాయి.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు సమావేశం అయ్యారు. నాయకుల తీరుపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏమన్నారో, ఎల్లో మీడియా ఏం రాసిందో తెలుసుకుందాం.
‘జిల్లాలో అనేక సమస్యలున్నాయి. అందరూ కలిసి ఉమ్మడిగా ఒక్కదానిపై అయినా పోరాటం చేశారా? కలిసికట్టుగా బలం ప్రదర్శించారా? వెనుకబడిపోతున్నారు. ఇలాగైతే కష్టం. దెబ్బ తింటారు జాగ్రత్త’ అని చంద్రబాబునాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలకు క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ ఏ మాత్రం పోరాటం చేయలేదని ఈ సమావేశంలో చంద్రబాబు మండిపడ్డారు.
టీడీపీ నేతలెవరూ ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయలేదని స్వయంగా చంద్రబాబే అన్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను అధికారంలోకి తెస్తుందని టీడీపీ నేతలు కలలు కంటున్నారు. మరోవైపు సీఎం జగన్ మాత్రం, తన ప్రభుత్వ, పార్టీలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ మరోసారి ప్రజల ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో వుంటున్నారు.
కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నేతలెవరూ జనంలో కనిపించడం లేదు. ఎల్లో చానళ్లల్లో మాత్రం అధికార పార్టీపై రంకెలేస్తు న్నారు. ఈ పంథాతో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ చేతిలో బలమైన మీడియా వ్యవస్థ వుండడంతో , వాటిలో ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి ప్రచారంతోనే తమ బాధ్యత తీరిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మీడియాకు తప్ప, జనానికి టీడీపీ దగ్గర కాలేకపోతోంది. ఇదే ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో లోపాల్ని చంద్రబాబు గుర్తిస్తున్నారు. అయితే ఒక విధానానికి అలవాటు పడిన టీడీపీ నేతలు జనంలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. బాబు మందలింపులు, గర్జనలు అన్నీ సమావేశానికే పరిమితమవుతున్నాయి. సమావేశం అనంతరం ఎప్పట్లాగే చానళ్లలో లేదా సొంత పనుల్లో టీడీపీ నేతలు నిమగ్నమవుతున్నారు.