ఏపీలో గెస్ట్ పొలిటీషయన్లు పెరిగిపోతున్నారు. గల్లీలో ఒక పార్టీ, ఢిల్లీలో మరోపార్టీ ప్రతినిధిగా కొనసాగుతూ స్వామి, స్వకార్యం అనే చందాన సొంత లాభాల్ని చూసుకుంటున్నారు. ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ముందు వరుసలో ఉన్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వీకెండ్ లీడర్ అనే పేరున్న సంగతి తెలిసిందే. ఇక సత్యకుమార్ విషయానికి వస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయన పేరు బలంగా వినిపిస్తోంది.
దీనికి కారణాలేంటో ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన పనిలేదు. తాను ప్రేమించి టీడీపీకి అండగా నిలిచేందుకు బీజేపీ నేతగా చంద్రబాబు పలుకులనే వల్లిస్తుంటారు. తాజాగా వైసీపీ విధ్వంసకర పార్టీ అని విమర్శించడం కూడా ఆ కోణంలోనే చూడాల్సి వుంటుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థకు, వైసీపీకి పెద్ద తేడా లేదని ఆయన ఘాటు విమర్శ చేశారు. సత్యకుమార్‌కు సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువ కావడంతో, ఆయనపై వెంటనే కౌంటర్లు వేస్తున్నారు.
“ఔను నిజమే సత్యన్నా. టీడీపీ నేతలకు, తమకు తేడా లేనట్టుగా కదా” అని సెటైర్స్ వేయడం గమనార్హం. “ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది. సత్యన్నా పచ్చని పలుకులే పలుకుతారు. వాట్ ఈజ్ రాంగ్” అంటూ మరికొందరు టీడీపీతో బీజేపీ జాతీయ కార్యదర్శికి ఉన్న అవినాభావ సంబంధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భర్త చచ్చిపోతే భార్యకంటే మరొకామె వెక్కివెక్కి ఏడ్చిన చందంగా… హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై చంద్రబాబు కంటే సత్యబాబు ఏడ్పు భలే ఎక్కువగా ఉందే అని మరికొందరు దెప్పి పొడవడం విశేషం. టీడీపీతో కలిసి ఏపీలో పాలన సాగిస్తున్నప్పుడు గుంటూరులో జిన్నాటవర్‌కు పేరు మార్చాలని ఎందుకు ఆలోచన రాలేదని, అప్పుడు గాఢనిద్రలో ఉన్నారా? అని నెటిజన్లు ప్రశ్నించడం గమనార్హం.
ఇంతకూ జగన్ గ్రాఫ్ పడిపోవడం సరే, ఏపీలో తమ పార్టీ గ్రాఫ్ సంగతేంటి సార్? అయినా తమరుండగా బీజేపీ గ్రాఫ్ ఎందుకు పెరుగుతుందిలే…తప్పు తప్పు, ఎందుకు పెరగనిస్తార్లే అని ఓ రేంజ్లో సత్యకుమార్‌పై నెటిజన్లు విరుచుకుపడడం గమనార్హం.
ఎన్నికల సమయంలో సత్యకుమార్ ఏపీకి ఎంత ఎక్కువ వస్తే, బీజేపీకి అంత నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ మనిషిగా టీడీపీ కోసం పని చేసే నిబద్ధత గల పచ్చ నాయకుడనే పేరు ఆయన సొంతం. ఈ వాస్తవం బీజేపీ పెద్దలకు ఎప్పుడు తెలుస్తుందో మరి!