ప‌వ‌న్‌తో పొత్తు లోకేశ్‌కు ఇష్టం లేదా?

నారా లోకేశ్‌పై వైసీపీ సోష‌ల్ మీడియా సెటైర్ల వ‌ర్షం కురిపిస్తోంది. నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న్ను అధికార పార్టీ సోష‌ల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటోంది. ఢిల్లీకి లోకేశ్ ఎందుకు వెళ్లాడ‌నే…

నారా లోకేశ్‌పై వైసీపీ సోష‌ల్ మీడియా సెటైర్ల వ‌ర్షం కురిపిస్తోంది. నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న్ను అధికార పార్టీ సోష‌ల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటోంది. ఢిల్లీకి లోకేశ్ ఎందుకు వెళ్లాడ‌నే ప్ర‌శ్న‌కు టీడీపీ వ‌ద్ద స‌రైన స‌మాధానం లేదు. ఎందుకంటే ఢిల్లీలో లోకేశ్ చేసింది, చేయ‌గ‌లిగేది ఏమీ లేదు. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీకి లోకేశ్ వెళ్ల‌డం ద్వారా, టీడీపీకి దేశ రాజ‌ధానిలో వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టే నాయ‌కులు లేర‌నే లోటును స్ప‌ష్టంగా బ‌య‌ట పెట్టింది.

ఢిల్లీలో లోకేశ్ బిజీగా ఉన్నారంటూ ఎల్లో మీడియా ప్ర‌చారం ఆయ‌న్ను మ‌రింత‌గా న‌వ్వులపాలు చేస్తోంది. ఇంత‌కూ ఢిల్లీలో లోకేశ్ చ‌క్క‌బెడుతున్న రాచ‌కార్యాలు ఏంట‌య్యా అంటే… మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు రాజ్‌ఘాట్‌ను సంద‌ర్శిస్తార‌ట‌. లోకేశ్‌తో పాటు టీడీపీ ఎంపీలు కూడా వెళ్ల‌నున్నార‌ట‌. గాంధీ స‌మాధి ద‌గ్గ‌ర నివాళుల‌ర్పించి చంద్ర‌బాబు అరెస్ట్‌పై నిర‌స‌న తెలియ‌జేస్తార‌ట‌.

అనంత‌రం న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి బాబును బ‌య‌టికి తీసుకొచ్చేందుకు లోకేశ్ శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తార‌ని చెబుతున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డంతో లోకేశ్ త‌న తండ్రి చంద్ర‌బాబుపై అలిగి ఢిల్లీకి వెళ్లార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా సెటైర్స్ విసురుతోంది. పొత్తుపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న చేస్తున్న సంద‌ర్భంలో మౌనంగా, విచారంతో లోకేశ్ నిలిచి ఉండ‌డాన్ని గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి జ‌న‌సేన‌తో పొత్తు లోకేశ్‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ ఈ ద‌ఫా చిన్న అవ‌కాశాన్ని కూడా విడిచి పెట్ట‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప‌వ‌న్‌ను క‌లుపుకెళ్లాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే త‌న అవ‌స‌రం టీడీపీకి ఉంద‌ని ప‌వ‌న్ భావ‌న‌. తన మ‌ద్ద‌తు లేక‌పోతే మ‌రోసారి సీఎం పీఠాన్ని జ‌గ‌న్‌కే అప్ప‌గిస్తార‌నే భ‌యాన్ని ప‌వ‌న్ క్రియేట్ చేశారు. మ‌రోవైపు టీడీపీతో పొత్తు వుంటే త‌ప్ప తాను గెల‌వ‌లేన‌ని ప‌వ‌న్‌కు తెలుసు. ఇలా ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల రీత్యా పొత్తు కుదుర్చుకోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని చంద్ర‌బాబు , ప‌వ‌న్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.

గ‌తంలో టీడీపీకి అధికారం త‌న భిక్ష అన్న‌ట్టు ప‌వ‌న్ ప‌లు ద‌ఫాలు చేసిన కామెంట్స్ లోకేశ్‌ను హ‌ర్ట్ చేశాయి. అప్ప‌టి నుంచి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌వ‌న్‌తో రాజ‌కీయంగా క‌లిసి వెళ్ల‌కూడ‌ద‌ని లోకేశ్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్టు టీడీపీ ముఖ్య‌నేత‌లు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో తండ్రి మాట‌ను కాద‌న‌లేక, అలాగ‌ని అంత‌రాత్మ‌కు విరుద్ధంగా ప‌వ‌న్‌తో పొత్తును అంగీక‌రించ‌లేక లోకేశ్ స‌త‌మ‌తం అవుతున్న‌ట్టు స‌మాచారం. అందుకే ఆయ‌న ఢిల్లీ వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.