తెలుగుదేశం పార్టీ మామూలు పార్టీ కాదు! జాతీయ పార్టీ. ఇది వ్యంగ్యంగా ఎవరో అనేది కాదు.. తమది జాతీయ పార్టీ అని తెలుగుదేశం నేతలే అధికారికంగా ప్రకటించేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి జాతీయాధ్యక్షుడు! నారా లోకేషుడు ఆ పార్టీకి జాతీయ కార్యదర్శి! మామూలు అధ్యక్షుడు కాదు, మామూలు కార్యదర్శి కాదు.. అంతా జాతీయమే!
తమ పార్టీకి అండమాన్ లో శాఖ ఉందని, మహారాష్ట్ర లో ఎన్నికలను ప్రభావితం చేసే శక్తి ఉందని, ఇంకా ఏదేదో అని.. అదంతా చూస్తూ ఉంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉందని.. ఇవన్నీ టీడీపీని కామెడీ చేయడానికి ఎవరో చెప్పిన విషయాలైతే కాదు! ఇవన్నీ వివిధ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్య నేతలు చెప్పుకున్న విషయాలే!
అసలు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేనిది తెలుగుదేశం పార్టీ ఎలా జాతీయ పార్టీ అవుతుందని ఆ పార్టీ కార్యకర్తలకు అనుమానం రాదు! కొంచెముండుట కొదవకాదు.. అనే ఇంగితాన్నితెలుగుదేశం పార్టీ గ్రహించదు! అందునా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కి ఇలాంటి కామెడీలు కొత్తా కాదు, విషయంలో తగ్గరు కూడా!
మరి మాటలు ఇలాంటి కోటలు దాటుతూ ఉండగా.. లోకేషుడి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతున్న తరుణంలో కర్ణాటక నుంచి ఇటువైపు వచ్చిన ఉత్సాహవంతుడు ఎవరో ఒకరు తనకు అవకాశం ఇస్తే సరిహద్దులోని కర్ణాటకలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ.. అని లోకేష్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు! అయితే తాము కర్ణాటకలో పోరాడలేమని లోకేషు ఆ కార్యకర్త ఉత్సాహాన్ని నీరుగార్చాడు. ఏపీ, తెలంగాణలో పోరాడితే చాలంటూ ప్రకటించుకున్నారు!
మరి పేరుకేమో తను జాతీయ కార్యదర్శి అని ట్యాగేసుకుని, తెలుగుదేశం జాతీయ పార్టీ అని, చంద్రబాబు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడంటూ ప్రకటించుకుంటూ.. ఏదో పంచాయతీ లెవల్ లో పోటీ చేస్తాననే పక్క పార్టీ కార్యకర్తను నిరుత్సాహ పరచడం ఏమిటో మరి! ఈ మాత్రం దానికి తెలుగుదేశం ఒక జాతీయ పార్టీ, లోకేషొక జాతీయ కార్యదర్శి, చంద్రబాబు ఒక జాతీయాధ్యక్షుడు.
అయినా లోకేషు తెలంగాణ పేరు ఎత్తడమూ కామెడీనే! తెలంగాణలో ఐదారు నెలల కిందట ఒక టూరేసి మళ్లీ అక్కడ చడీచప్పుడు చేయడం లేదు చంద్రబాబు. ఈ మాత్రం దానికి తెలంగాణలో పోరాటం అంటూ చెప్పడం ఒక్కటీ తక్కువ! ఏపీలో నాగళి ఈడిస్తే చాలని చెబితే పోదా!