కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇంకా ఫస్ట్ లిస్ట్ పేరుతో కొంతమంది అభ్యర్థులను కూడా ఇంకా విడుదల చేయలేదు! ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సగం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. జేడీఎస్ కూడా ఒక జాబితాను విడుదల చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటనకు పూనుకోలేదు. మే పదో తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరో వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇలాంటి నేపథ్యంలో ఇంకా బీజేపీ అభ్యర్థులను ఫైనలైజ్ చేయకపోవడం గమనార్హం. బహుశా కాంగ్రెస్, జేడీఎస్ లు అభ్యర్థుల జాబితానంతా ప్రకటించిన తర్వాత బీజేపీ ఈ పనికి పూనుకుంటుందేమో. టికెట్ దొరకని వారు అటు వైపు వెళ్లకుండా ఆపడానికి ఈ స్ట్రాటజీనేమో!
ఆ సంగతలా ఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఈదడానికి బీజేపీ పూర్తిగా మోడీ నామస్మరణే నమ్ముకున్నట్టుగా ఉంది. ఈ ఎన్నికల సమరంగణంలో మోడీ ఏకంగా 20 సభల్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే నలభై రోజుల్లోపే మోడీ కర్ణాటకలో 20 సభలు, ర్యాలీల్లో పాల్గొనబోతూ ఉండటం గమనార్హం! మరి మోడీనే 20 చోట్ల అంటే.. ఇంకా అమిత్ షా మరే స్థాయిలో కర్ణాటకలో ప్రచారపర్వాన్ని సాగిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం.
ఇప్పటికే మోడీ ఢిల్లీ- కర్ణాటక పర్యటనలు చేపట్టారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా.. అందుకు ఏడాది ముందు నుంచినే మోడీ ఆ రాష్ట్ర పర్యటనలు వరసగా చేపడుతూ ఉంటారు. కర్ణాటకను ఇప్పటికే ఇలా చుట్టేస్తున్న 20 ర్యాలీలు- సభల ద్వారా అంతా తాను అవుతున్నట్టుగా ఉన్నారు. మోడీ పేరుతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల బీజేపీ ఓటు అడుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది, బొమ్మైనే మళ్లీ సీఎం అంటారా.. అనే చర్చకే బీజేపీ ఆస్కారం ఇవ్వడం లేదు!