టీడీపీ యువ కిశోరం లోకేశ్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆయన అదృశ్యంపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఆచూకీపై టీడీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇవ్వడం గమనార్హం. లోకేశ్ విజయవాడలో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే టీడీపీ నేతలెవరికీ ఆయన అపాయింట్మెంట్స్ దొరకకపోవడం గమనార్హం. కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఆయన అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీలోకి వచ్చే కొత్త వారికే మాత్రం ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. వారితో కలుస్తూ, పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.
టీడీపీలోకి వస్తే మంచి భవిష్యత్ వుంటుందని, కలిసి నడుద్దామని, పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని వైసీపీ నేతలతో ఆయన అంటున్నారు. అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులు టీడీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వారిని లోకేశ్ కలవడం విశేషం. టికెట్ కోసం లోకేశ్‌ను ప్రసన్న చేసుకోవాలనుకునే వారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలిసింది. ఆ వ్యవహారమంతా పెద్దాయన చూసుకుంటున్నారని లోకేశ్ తేల్చి చెబుతున్నారని సమాచారం.
మరోవైపు మంగళగిరిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిసింది. ఎలాగైనా తనను ఓడించేందుకు సీఎం జగన్ వ్యూహం రచిస్తారని, దాన్ని ఎదుర్కోడానికి అన్ని రకాలుగా లోకేశ్ సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా పసుపు సైన్యాన్ని మంగళగిరిలో లోకేశ్ దించారు. వారితో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.