రానున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలంటే సమరమే. వైఎస్సార్ జిల్లా వైసీపీకి కంచుకోట అనే పేరు వుంది. ఇందుకు తగ్గట్టుగానే 2014, 2019 ఎన్నికల ఫలితాలున్నాయి. 2014లో కేవలం రాజంపేటలో మాత్రమే టీడీపీ అభ్యర్థి మేడా మల్లిఖార్జున్‌రెడ్డి గెలుపొందారు. 2019లో పదికి పది స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అలాగే కడప, రాజంపేట ఎంపీ స్థానాలూ వైసీపీ ఖాతాలో పడ్డాయి.
అయితే ఈ దఫా ఎన్నికలు హోరాహోరీని తలపించనున్నాయి. ముఖ్యంగా వైసీపీ గెలిచే స్థానాల్లో కడప పేరు నిన్నమొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు కడప అసెంబ్లీ పరిధిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కడప సీటును ముస్లిం మైనార్టీలకు వైసీపీ కేటాయించింది. గత రెండు దఫాలుగా అంజాద్ బాషా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
ఈ దఫా కూడా ఆయన బరిలో ఉంటారు. టీడీపీ విషయానికి వస్తే ఆర్.మాధవీరెడ్డి పోటీ చేయనున్నారు. ఇంత కాలం వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ వుంటుందని అంతా అనుకున్నారు. తాజాగా మాజీ మంత్రి అహ్మదుల్లా తెరపైకి వచ్చారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యక్తిగతంగా అహ్మదుల్లాకు కడప నగరంలో తన మతంలో చెప్పుకోతగ్గ పలుకు బడి వుంది. ఈయన తండ్రి రహంతుల్లా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
కడప నగరంలో అహ్మదుల్లాకు రాజకీయంగా పట్టు వుంది. పదేళ్లుగా అంజాద్ బాషా ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం, సోదరుడితో పాటు ఇతర బంధులకు తప్ప, ఎవరికీ ప్రయోజనాలు కలిగించలేదనే ఆగ్రహం వైసీపీ నేతలు, కార్యకర్తల్లో వుంది. గత ఎన్నికల్లో 54 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన అంజాద్‌బాషాపై కడప నగరంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత వుంది. ఈ నేపథ్యంలో అంజాద్‌ను వ్యతిరేకించే వారంతా టీడీపీకి ఓట్లు వేయడం ఇష్టం లేక మాజీ మంత్రి అహ్మదుల్లా వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
అలాగే టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి కడపలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గడపకూ వెళ్లి ఒక్క చాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. హిందువుల ఓట్లను తన వైపు తిప్పుకునే క్రమంలో ఆమె చొరవ ఎంతోకొంత సత్ఫలితాలు ఇస్తుందని టీడీపీ ఆశలు పెట్టుకుంది. మాధవీరెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం వుంది. మాజీ మంత్రి, దివంగత ఆర్ రాజగోపాల్‌రెడ్డి కోడలే మాధవీరెడ్డి. ఈమె భర్త ఆర్.శ్రీనివాస్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వుంది.
ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో జనాన్ని తమ వైపు తిప్పుకోడానికి మాధవీరెడ్డి పని సులువవుతోందనే టాక్ వినిపిస్తోంది. కడప మనదే అనే ఫీలింగ్ నుంచి వైసీపీ త్వరగా బయట పడకపోతే అంతే సంగతులు. ఎందుకంటే చాపకింద నీరులా టీడీపీ అభ్యర్థి దూసుకోతున్నారు. అలాగే మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా వైసీపీ ఓటు బ్యాంక్‌ను ఎంతో కొంత చీల్చే పరిస్థితి. అందుకే ఈ దఫా కడప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.