రాజకీయాల్లో విచక్షణ కరువైంది. దీంతో విమర్శలకు సెన్సార్ కరువైంది. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇవ్వడంలో టీడీపీ, వైసీపీ, జనసేన ఏదీ మినహాయింపు కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఆ తాను ముక్కలే అనే చందంగా తయారయ్యాయి. విమర్శలు చేసే వాళ్లకంటే వినేవాళ్లే సిగ్గుపడాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా టీడీపీ యువరథసారథి నారా లోకేశ్‌పై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
లోకేశ్‌తో పాటు ఆయన భార్య, తల్లిని కూడా ఆమె వదిలి పెట్టకపోవడం గమనార్హం. తాడేపల్లిలో ఆదివారం పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబు కుటుంబమంతా తాగుబోతు కుటుంబమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు కాదు… సారా చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పైకి పాల వ్యాపారం.. తెర వెనుక సారా పరిశ్రమ నడుపుతున్నారని విమర్శించారు.
మద్యం ద్వారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ భార్య బ్రాహ్మణికి రోజూ రూ.కోటి ఆదాయం అందుతోందని తీవ్ర విమర్శలు చేశారు. బీ-3 బ్రాండ్లు అంటే భువనేశ్వరి, బ్రాహ్మాణి, బాబు అని పోతుల సునీత సరికొత్త నిర్వచనం చెప్పారు. అంతటితో ఆమె ఆగలేదు. మగువ, మందు లేనిదే లోకేశ్‌కు నిద్రపట్టదని సంచలన ఆరోపణ చేశారు. చుక్క లేకపోతే చంద్ర బాబు, లోకేశ్ ఒక్కమాట కూడా మాట్లాడలేరన్నారు.
లోకేశ్‌పై వైసీపీ మహిళా అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో టీడీపీ మహిళా నేతలు తప్పకుండా మీడియా ముందుకొస్తారు. ఇంతకంటే దారుణంగా జగన్, వైఎస్ భారతిలపై విమర్శలు గుప్పిస్తారు. అంతిమంగా సంస్కారహీనంగా రాజకీయాలు తయారయ్యాయనే ఆవేదన మిగిల్చనున్నారు. అధినేతల మెప్పుకోసం ద్వితీయ శ్రేణి నాయకులు నోటికి హద్దూఅదుపూ లేకుండా మాట్లాడ్డం గత కొన్నేళ్లుగా ప్యాషన్‌గా మారింది.
ఇలాంటి విమర్శలే ఆకట్టుకుంటున్నాయి. విధానాల పరంగా విమర్శించుకోవడం ఎప్పుడో మానేశారు. వ్యక్తిగత దూషణలే పరమావధిగా రాజకీయాలు కొనసాగుతున్నాయనేది నిజం. ఈ పరంపరలోనే విమర్శలను చూడాల్సి వుంది.