టీడీపీ అధినేత చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. ఈ కలయిక రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ దువ్వడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. అలాగని జూనియర్ ఎన్టీఆర్‌పై నోరెత్తి విమర్శ చేయలేని దుస్థితి.
ఈ నేపథ్యంలో టీడీపీని రెచ్చగొట్టేలా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఉందని, ఆయన సేవలను వినియోగించుకుంటామని తేల్చి చెప్పారు. అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్తుందని స్పష్టం చేయడం గమనార్హం. సోము వీర్రాజు వ్యూహాత్మకంగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ సేవల్ని ఉపయోగించుకోవడం అంటే… ఎన్నికల్లో ప్రచారానికే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమిత్‌షాతో భేటీపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని, అలాగే ఏపీలో కూడా ఆయన్ను తిప్పుతారనే ఊహాగానాలు చెలరేగాయి. వీటిపై ఎన్టీఆర్ స్పందించలేదు. రాజకీయంగా ప్రచారమవుతున్న ఏ ఒక్క అంశంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదంటే, ఆయన మౌనంగా అంగీకరించడమే అని చెబుతున్నారు. ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటున్నదే అని అంటున్నారు.
తనను టీడీపీ పక్కన పెట్టడంపై జూనియుర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంటున్నారనే ప్రచారం తెలిసిందే. దీన్నే బీజేపీ అవకాశంగా తీసుకుందని అంటున్నారు. దివంగత ఎన్టీఆర్ మనవడిగా, రాజకీయ-సినీ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయంగా, సినిమా పరంగా ఉన్న క్రేజ్‌ను రాజకీయంగా వాడుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై బీజేపీ నేతలు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ …టీడీపీ పుండుపై కారం చల్లుతున్నారు. ఈ ధోరణి ఎలాంటి రాజకీయ మార్పునకు దారి తీస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.