‘లైగర్’ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ ట్రోలింగ్‌కు విసిగిపోయారు. తాజాగా ఆమె ఓ విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా యూనిట్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇదే సందర్భంలో అట్టర్ ప్లాప్ అయితే అదే రేంజ్‌లో విమర్శల రాళ్ల వర్షం కురుస్తుంది. రెండింటిని ఎదుర్కోడానికి సిద్ధపడాల్సిందే. ఎందుకంటే గ్లామర్ రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న వాళ్లకు ఇవి తప్పవు.
తాజాగా ఓ సినిమా ప్లాప్ ఎంత వేదన మిగిల్చుతుందో నిర్మాత ఛార్మికి బాగా అనుభవంలోకి వచ్చినట్టుంది. ఇవాళ్టి ఆమె ట్వీట్ చూస్తే బాగా నిరాశనిస్పృహలకు లోనైనట్టు అర్థమవుతోంది. ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
‘కాస్త శాంతించండి అబ్బాయిలూ. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. పూరీ కనెక్ట్స్ సంస్థ మరింత బలంగా, ఉన్న తంగా సన్నద్ధమై త్వరలోనే తిరిగి మళ్లీ వస్తుంది. అప్పటి వరకూ ప్రశాంతంగా జీవించండి, జీవించనివ్వండి’ అని ఆమె ట్వీట్ చేయడం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది.
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా ఫెయిల్యూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే చచ్చిన పామును పదేపదే చంపాలని అనుకున్నట్టుంటుంది. ఈ సినిమా ప్లాప్ చిత్రయూనిట్‌లో ఎంతటి నిర్వేదాన్ని నింపిందో ఛార్మీ తాజా ట్వీటే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.